26 June, 2026 | 3:17 AM

నార్కెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

26-06-2026 01:36 AM

చిట్యాల, జూన్ 25 : నార్కెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సంఘ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మహిళలు ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అనేక రకాల వ్యాధులు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఉచిత రక్త పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని తెలిపారు. మహిళా సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి నాయకత్వంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా తరచూ చేయించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.