18 April, 2026 | 12:06 AM

2027లో జనగణన

05-06-2025 12:00 AM
  1. మార్చి 1 నుంచి నిర్వహణ
  2. జమ్మూ, లఢఖ్‌లో 2026 అక్టోబర్ నుంచే.. 
  3. తొలిసారి జనగణనలోనే కులగణన
  4. రెండు దశల్లో గణనకు నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 4: కరోనా కారణంగా వాయిదా పడ్డ జనగణనను 2027 మార్చి 1 నుంచి నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైం ది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. తొలి సారిగా కులగణనను కూడా జనగణనలోనే చేపట్టనున్నారు. జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపారు. జనగణన, కులగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జూన్ 16న ప్రచురించే అవకాశం ఉంది.

1948 సెన్సన్ యాక్ట్ ప్రకారం ప్రతి 10 ఏండ్లకోసారి దేశంలో జనగణన జరగాలి. చివరి సారిగా 2011లో జనగణన జరిగింది. లెక్క ప్రకారం 2021లో గణన జరగాల్సి ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా అది వాయి దా పడింది. దేశంలోని రాజకీయ పార్టీలు కులగణన కూడా చేయాలని డిమాండ్ చేయడంతో ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టేందుకు సమాయ త్తం అయ్యారు.

2011 లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లుగా తేలింది. 2001తో పోల్చుకున్నపుడు జనాభా రేటులో 17.7 శాతం వృద్ధి రేటు నమోదయింది. 2021లో జనగణన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ మహమ్మారి వల్ల వాయిదా పడింది. 

డీ లిమిటేషన్ ఉండనుందా? 

జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రం జనగణనకు పూనుకోవడంతో ఈ ప్రక్రియ తర్వాత డీలిమిటేషన్ కూడా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జనాభాకు తగ్గట్టు లోక్‌సభ నియోజవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడమే డీలిమిటేషన్. 1976 వరకు ప్రతి జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభ జన జరుగుతూ వచ్చింది.

కానీ 1976లో జనాభా నియంత్రణ కోసం నియోజకవర్గాల పునర్విభజనను 2001 దాకా ఆపారు. కానీ ఆ తర్వాత 2026 వరకు దాన్ని పొడగించారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే ప్రస్తుతం దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంది. అప్పటితో పోల్చుకుంటే దేశ జనాభా రెట్టింపైంది. కాబట్టి లోక్‌సభ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.  

జమ్మూలో 2026లోనే.. 

దేశమంతటా జనగణన 2027 మార్చి లో మొదలైతే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లఢఖ్ వంటి మంచు కురిసే ప్రాంతాల్లో 2026 అక్టోబర్‌లోనే గణ న చేపట్టనున్నారు.