స్వీయ గణనతో జనగణన వేగవంతం
మంచిర్యాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : స్వీయ గణన ప్రక్రియతో జనగణన వేగవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం సబ్బెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్నీ ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. మే 10వ వరకు జరగనున్న స్వీయ గణన ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు.
స్వీయ గణన కార్యక్రమం నిర్వహణలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ వ్యక్తులు, గణన అధికారులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.మొదటి విడతలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన, 2వ విడతలో జనగణన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్పష్టమైన జాబితా రూపొందించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.
మే 10 వరకు ఆన్ లైన్ లో https://se.census.gov.in వెబ్ సైట్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని, ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ వినియోగించాలని, ఇండ్ల గణనకు సంబంధించి 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి రివ్యూ ద్వారా పరిశీలించుకోవాలని తెలిపారు. మే 11 నుండి ఇండ్ల గణన అధికారులు కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చినప్పుడు ఈ నెంబర్ ను అందించాలని తెలిపారు.ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
పీహెచ్‌సీ సందర్శన: హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పంచాయతీ అధికారి సుమన్ తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పలు సూచించారు.






