15 August, 2026 | 2:25 AM

ప్రీ రైడ్స్ టిప్స్ వద్దు!

15-08-2026 01:57 AM

ఆ ఆప్షన్లనూ తొలగించండి

వాహన సేవల సంస్థలకు కేంద్రం ఆదేశం 

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఉబెర్, ఓలా, ఇతర ప్రయాణ వాహనాలను బుక్ చేసుకునే యాప్‌ల్లో ఇక నుంచి ప్రీ రైడ్ టిప్ ఆప్షన్లు కనిపించవు. ప్రయాణికులు క్యాబ్‌ను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణానికి ముందే టిప్ చెల్లించాలని సూచించవు. యాప్‌ల్లో ‘అడ్వాన్స్ టిప్’, ‘చూజ్ యాన్ యాడ్-ఆన్’, ‘క్వికర్ రైడ్ కన్ఫర్మేషన్’ వంటి ఆప్షన్లు వెంటనే తొలగించాలని యాప్ ఆధారిత వాహన సేవల సంస్థలన్నింటినీ కేంద్రం ఆదేశించింది.

మోటార్ వాహన నిర్వహణ మార్గదర్శకాలకు ఇవి విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే రైడ్ ముగిశాక ప్రయాణికులు స్వచ్ఛందంగా టిప్ ఇవ్వొచ్చని సూచించింది. తొందరగా క్యాబ్ బుక్ చేసుకోవా లని లేదా రైడ్ దొరికే అవకాశాలను మెరుగు పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణికులు అదనపు చెల్లింపులు చేసేలా ప్రోత్సహించ కూడదని స్పష్టం చేసింది. బుకింగ్ ప్రక్రియలో ప్రీ రైడ్ ఆప్షన్లు యాప్‌లలో వస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.

ప్రీ రైడ్ టిప్ ఇస్తే డ్రైవర్ తమ అభ్యర్థనను త్వరగా ఆమోదిస్తారన్న భావన వినియోగదారుల్లో కలుగుతోందని పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రయాణం ముగిసిన తర్వాతే ప్రయాణికులు స్వచ్ఛందంగా టిప్ ఇవ్వొచ్చు. అంతేకానీ ముందుగా చెల్లించరాదు. ప్రయాణికులు ఇచ్చే టిప్ మొత్తం డ్రైవర్‌కే చెందాలి. వాహన సేవల సంస్థలు ఎలాంటి వాటా తీసుకోకూడదని స్పష్టం చేసింది. బుకింగ్ ప్రక్రియలో కేంద్ర మార్గదర్శకాలన్నింటినీ పాటించేలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో వెంటనే మార్పులు చేయాలని కేంద్రం ఆదేశించింది.