15 August, 2026 | 3:19 AM

గుట్టపై దీక్షాపరుల మండపం

15-08-2026 02:22 AM
  1. రూ.46 కోట్లతో నిర్మాణం 
  2. విజన్-2047 వ్యూహపత్రం రూపకల్పన బాధ్యతలు ఐఎస్బీకి
  3. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి కీలక నిర్ణయాలు 
  4. చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భేటీ
  5.    26 ఎజెండా అంశాలు, 5 టేబుల్ అంశాలకు ఆమోదం 

యాదగిరిగుట్ట, ఆగస్టు 14 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయా లు తీసుకుంది. భక్తుల సౌకర్యాల విస్తరణతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా దేవస్థానాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసింది.

ముఖ్యంగా యాదగిరి కొండపైన పుష్కరిణి వద్ద సుమారు రూ.43.12 కోట్లతో దీక్షాపరుల మండ పం నిర్మాణానికి, అలాగే విజన్--2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి వ్యూహ పత్రం రూపొందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ బిజినెస్ (ఐఎస్బీ)ను నియమించేందుకు పా లకమండలి ఆమోదం తెలిపింది.

యాదగిరిగుట్ట లో శుక్రవారం సమావేశమైన ధర్మకర్తల మండలి మొ త్తం 26 ఎజెండా అంశాలతో పాటు 5 టేబుల్(ఎజెండాలో పెట్టని) అంశాలను ఆమోదిం చింది. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండలి చైర్మన్ డా. ఎం. సత్యనారాయణ రెడ్డి ఈ నిర్ణయాలను వెల్లడించారు.

రూ.43.12 కోట్లతో దీక్షాపరుల మండపం

భక్తుల సౌకర్యార్థం కొండపైన పుష్కరిణి వద్ద సుమారు రూ.43.12 కోట్ల వ్యయంతో దీక్షాపరుల మండపం నిర్మించేందుకు ఆమోదం తెలిపి నట్లు చైర్మన్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. అలాగే బాలాలయం స్థలంలో సుమారు రూ.9. 87 కోట్లతో నిత్యకళ్యాణ మండపం, రాయిగిరి వద్ద ప్రస్తుత ఆర్చ్ స్థానంలో సుమారు రూ.3.16 కోట్లతో భారీ ఆర్చ్ నిర్మించేందుకు నిర్ణయించారు. నిత్యకళ్యాణ మండపం, భారీ ఆర్చ్ నిర్మా ణాలను ధర్మకర్తల మండలి చైర్మన్ డా. ఎం. సత్యనారాయణ రెడ్డి సొంత ఖర్చులతో చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

వేద పాఠశాల, వర్సిటీ, మోడల్ గోశాల

దేవస్థానం పరిసర ప్రాంతంలో వేద పాఠశాల, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు 40 ఎకరాల్లో మోడల్ గోశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్నప్రసాదం సౌకర్యాన్ని కూడా విస్తరించనున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 1,500 మం ది అన్నప్రసాదం స్వీకరిస్తుండగా, ఆ సంఖ్యను 2,000 మందికి పెంచేందుకు ఆమోదం తెలిపారు. పరిశుభ్రత ప్రమా ణాలతో అన్నప్రసాదాల తయారీ కోసం అవసరమైన పరికరాలను రూ.18 లక్షలతో టెండర్ ద్వారా కొనుగోలు చేయనున్నారు.

ఆన్‌లైన్ సేవలకు టీసీఎస్ సహకారం

ప్రముఖ దేవాలయాల్లో అమలవుతున్న విధానాలను అనుసరించి యాదాద్రి దేవస్థానంలో నూ టీసీఎస్ సంస్థ సహకారంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆన్‌లైన్ సేవలు, ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ తదితర సౌకర్యాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేవస్థాన అభివృద్ధి పనులను విజ న్--2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు వ్యూహ పత్రం తయారు చేయడానికి ఐఎస్బీ వారిని నియమించేందుకు ఆమోదం తెలిపారు.

ఆర్థిక క్రమశిక్షణకు ప్రత్యేక కమిటీలు

దేవస్థానంలో ఆర్థిక క్రమశిక్షణ, పనుల నాణ్య త, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, దేవస్థాన ఆస్తుల సమర్థవంతమైన నిర్వహణ కోసం ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక సబ్ కమిటీలు, కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. దేవస్థాన భవన సముదాయాలు, పార్కిం గ్ స్థలంలో నాలుగు మెగావాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం పరిసర ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో గరుడాళ్వార్, యాద ఋషి, శ్రీరామానుజులు, ప్రహ్లాదుడు, శ్రీ ఆంజనేయస్వామి వారి రాతి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు.

రెండో కళ్యాణకట్ట, ఎమినిటీ సెంటర్లు

వయోవృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల సౌకర్యార్థం కొండకింద దేవస్థానం అద్దె గదుల సమీ పంలో రూ.9 లక్షలతో రెండో కళ్యాణకట్ట నిర్మించనున్నారు. ఈ నిర్మాణాన్ని ధర్మకర్తల మండలి సభ్యుడు గుండా మల్లయ్య తన ఖర్చులతో చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భక్తుల సౌల భ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొండపైన వేంచేపు మండపం పక్కన డోనార్ ఎమినిటీ సెంటర్, బస్టాండ్ ఉత్తర భాగంలో పిలిగ్రిమ్ ఎమినిటీ సెంటర్ ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.

ఎలక్ట్రానిక్ శంకుచక్ర నామాలు, సోలార్ ఫెన్సింగ్

యాదగిరిగుట్ట పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు స్పష్టంగా కనిపించేలా గతంలో ఉన్న మాది రిగానే ఆలయ దక్షిణ భాగంలో ఎలక్ట్రానిక్ శంకుచక్ర నామాలకు లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఆ మోదం తెలిపారు. తన సొంత ఖర్చులతో లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు ధర్మకర్తల మండలి సభ్యురాలు కొణిదెల సురేఖ తెలిపారు. అదే విధంగా కొండపైన విష్ణు పుష్కరిణి ప్రాంతాన్ని కోతుల నుంచి రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. దీన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు ధర్మకర్తల మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ముందుకు వచ్చినట్లు చైర్మన్ తెలిపారు.

మెట్ల మార్గంలో షెడ్.. ప్రొటోకాల్ దర్శనంపై స్పష్టత

భక్తుల సౌకర్యార్థం కొండకింద నుంచి కొండపైకి వచ్చే మెట్ల మార్గంలో దాతల సహకారంతో షెడ్ నిర్మించేందుకు సంబంధించిన ఎంవోను పాలకమండలి ఆమోదించింది. ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ప్రముఖులు ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ప్రొటోకాల్ దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ స్పష్టం చేశారు. సమావేశంలో ఆలయ ఈవో భవానీ శంకర్, పాలక మండలి సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిల్లప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్ గౌడ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, ఎం. రాఘవేందర్‌రావు, లక్ష్మీనరసింహ నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

  •  ధర్మకర్తల మండలి సభ్యురాలు సీ విజయరాజం

యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు సీ విజయరాజం పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన పాలక మండలి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరు లతో మాట్లాడారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దేవస్థానం అభివృద్ధి, మౌలిక వస తుల విస్తరణ, సాంకేతికత వినియోగం, పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిది ద్దడం తదితర అంశాలపై పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు ఆమె తెలిపారు.

వీటిని ప్రణాళికాబద్దంగా, కచ్చితంగా అమ లు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, ప్రతి భక్తుడికి ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, అత్యుత్తమ సౌకర్యాలు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు.

ఇప్పటికే ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులు, భక్తులకు అవసరమైన అదనపు సౌకర్యాలు కల్ప న వంటి అంశాలు పాలక మండలి దృష్టికి వచ్చాయని  తెలిపారు. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ, ఆలయాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే పాలక మండలి లక్ష్యమని పేర్కొన్నారు.