calender_icon.png 12 November, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంచరీల మోత

16-12-2024 12:50:46 AM

బ్రిస్బేన్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వర్షం అంతరాయంతో తొలిరోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే రెండో రోజు వరుణుడు శాంతించడంతో ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ శతకాలతో హోరెత్తించారు. ఫలితంగా రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (45 నాటౌట్), మిచెల్ స్టార్క్ (7*) క్రీజులో ఉన్నారు. టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. సిరాజ్, నితీశ్ కుమార్ చెరొక వికెట్ పడగొట్టారు.

మెరిసిన హెడ్, స్మిత్..

28/0 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి మూడు వికెట్లను తొందరగానే కోల్పోయింది. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండడంతో బుమ్రా చెలరేగిపోయాడు. అయితే మూడు వికెట్లు తీసిన ఆనందం భారత్‌కు ఎక్కువసేపు నిలవలేదు. మిడిలార్డర్‌లో స్టీవ్ స్మిత్ (190 బంతుల్లో 101), హెడ్ (160 బంతుల్లో 152) భారత బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. అనంతరం స్మిత్ వెనుదిరగ్గా.. హెడ్ మాత్రం తన జోరు ప్రదర్శించాడు. హెడ్, మార్ష్ వెనుదిరిగిన అనంతరం అలెక్స్ కేరీ, కమిన్స్ కలిసి ఆసీస్ స్కోరును 400 దాటించారు. బంతి పేస్‌కు అనుకూలిస్తుండడంతో భారత బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది.