గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ సీఈవో సస్పెండ్
గొర్రెల పంపిణీ స్కాం
పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 11(విజయక్రాంతి) : తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ సీఈవో రాంచందర్ నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనను విధుల నుంచి తప్పిస్తూ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్త ర్వులు చేశారు. రాంచందర్ నాయక్ పశుసంవర్ధక శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ. 700 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పలువురు అనుమాని తులను అదుపులోకి తీసుకుని విచారించిన ఏసీబీ వారిపై వచ్చిన అభియోగాలు నిర్ధారణ కావడంతో వారిని చంచల్‌గూడ జైల్‌కు పంపింది.
కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రాంచందర్ నాయక్ గత ప్రభుత్వంలో సంబంధిత శాఖ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్‌లను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండవ రోజు మంగళవారం కూడా ఈ విచారణ సాగింది. మొదటి రోజు కస్టడీ విచారణలో రాంచందర్ నోరు మెదపలేదని సమాచారం. గొర్రెల కొనుగోలు వ్యవహారంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాను అమాయకుడినని, ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే అమలు చేశానని చెప్పినట్లు తెలిసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కూడా విచారణకు సహకరించడంలేదని తెలుస్తోంది.






