ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
ఉత్తీర్ణుల్లో 83 శాతం అమ్మాయిలే
బీఎడ్‌కు బీటెక్ అభ్యర్థులు సైతం పోటీ
20 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి: ప్రొఫెసర్ లింబాద్రి
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రెండేళ్ల బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్శిటీ ఇన్‌చార్జి వీసీ నవీన్ మిట్టల్ కలిసి ఫలితాలను విడుదల చేశారు.
మొత్తం 33,879 మంది దరఖాస్తు చేసుకోగా 29,463 మంది పరీక్షకు హాజరు కాగా 28,549 (96.90 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎడ్‌సెట్‌లో మొదటి ర్యాంకును నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన నవీన్‌కుమార్ కైవసం చేసుకున్నారు. రెండో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన అశిత నారాయణ్, మూడో ర్యాంకు శ్రీతేజ సాధించారు. టాప్ టెన్‌లో 9 మంది తెలంగాణకు చెందినవారు కాగా ఏపీ నుంచి ఒక విద్యార్థి ఉన్నారు.
బీటెక్ అభ్యర్థుల పోటీ
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ వృత్తి చేసేందుకు డిగ్రీ విద్యార్థులు బీఎడ్ కోర్సు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలను పక్కనబెడితే ప్రైవేట్ స్కూళ్లలో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. దీంతో డిగ్రీలు, పీజీలతో సంబంధం లేకుండా బీఎడ్ కోర్సు చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఎడ్‌సెట్‌కు బీటెక్ విద్యార్థులూ పోటీపడ్డారు. ఈసారి బీఏ, బీకామ్, బీఎస్సీ విద్యార్థులతో సమానంగా బీటెక్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 500 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని తెలిపారు. గతేడాది కూడా 400 మంది వరకు ఎడ్‌సెట్ పరీక్ష రాసినట్లు స్పష్టం చేశారు.
అమ్మాయిలే ఎక్కువ...
బీఎడ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటున్నారు. గతంలో బీఎడ్‌లో పురుషులే ఎక్కువగా దరఖాస్తు చేసేవారు. కొంత కాలంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో అమ్మాయిల శాతం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఎడ్‌సెట్ పరీక్షకు మొత్తం 33,879 మంది దరఖాస్తు చేసుకుంటే వీరిలో 28,147(83.08 శాతం) మంది అమ్మాయిలు కాగా 5,732 (16.91 శాతం) మంది అబ్బాయిలు ఉన్నారు. మొ త్తం 28,459 మంది ఉత్తీర్ణులుకాగా వీరిలో 23,780 మంది అమ్మాయిలు ఉన్నారు. 4,769 మంది అబ్బాయిలు ఉన్నారు.
20 వేల సీట్లు
రాష్టంలో మొత్తం 208 బీఎడ్ కాలేజీలు ఉంటే, అందులో 20 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత పొందిన వారు 28 వేల మంది అభ్యర్థులుంటే సీట్లు 20 వేల వరకు ఉన్నాయి. అమ్మాయిల ఉన్నత విద్యలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు ప్రవేశాలను దోస్త్ ద్వారానే నిర్వహిస్తున్నాం.
లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
19 రోజుల్లో ఫలితాలు
మే 23న ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తే జూన్ 11న ఫలితాలను విడుదల చేశాం. గతేడాదిలో 75 శాతం వరకు సీట్లు భర్తీ చేశాం. 25 శాతం వరకు భర్తీ కాలేదు. ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించి కేవలం 19 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించాం.
నవీన్ మిట్టల్,
మహాత్మాగాంధీ
వర్సిటీ ఇన్‌చార్జి వీసీ






