ములుకనూర్ మహిళా డెయిరీకి ప్రశంసాపత్రం
- ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ అందజేత
- సకాలంలో పన్నులు చెల్లించి ఆదర్శంగా నిలిచిన డెయిరీ
- పాలకవర్గాన్ని, సిబ్బందిని అభినందించిన పలువురు
భీమదేవరపల్లి, జూలై 13 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని ప్రసిద్ధ ములుకనూర్ మహిళా సహకార డెయిరీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను సకాలంలో వస్తు సేవల పన్ను తిరిగి చెల్లించడంతోపాటు, పన్నులను సక్రమంగా చెల్లించినందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్’ ముల్కనూర్ మహిళా స్వకృషి డెయిరీకి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, బలమైన నవభారత నిర్మాణానికి ములుకనూర్ మహిళా స్వకృషి డెయిరీ గణనీయమైన సహకారం అందించిందని కేంద్ర ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ ద్వారా కొనియాడింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వివేక్ చతుర్వేది సంతకంతో కూడిన ప్రశంసా పత్రాన్ని డెయిరీకి జారీ చేశారు. సకాలంలో పన్నులు చెల్లిస్తూ ఆదర్శంగా నిలిచిన ములుకనూర్ మహిళా డెయిరీ పాలకవర్గాన్ని, సిబ్బందిని,సభ్యులను పలువురు అభినందిస్తున్నారు.






