14 July, 2026 | 3:54 AM

టెట్‌లో ఉత్తీర్ణత 43.94 శాతం

14-07-2026 01:17 AM
  1. పరీక్షలో 14 వేలమంది టీచర్లు ఫెయిల్
  2.   21న ఇన్‌సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్
  3. పేపర్1లో భూపాలపల్లి జిల్లా, పేపర్2లో కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలు మొదటి స్థానం

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీజీ టెట్)లో 43.94 శాతం ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో 14 వేలమంది టీచర్లు ఫెయిల్ అయ్యారు. పేపర్1లో 23,590 మంది, పేపర్2లో 17,987 మంది మాత్రమే పాసయ్యారు. టెట్ పేపర్1లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పేపర్2లో భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. అయితే ప్రభుత్వం ఈ నెల 21న ఇన్‌సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించనుంది.

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీజీ టెట్) ఫలితాలను ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్ రమేష్‌తో కలిసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం మధ్యాహ్నం డీఎస్‌ఈ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. జూన్16 నుంచి 22 మధ్య మొత్తం పది సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 16 నుంచి 22 వరకు టెట్‌కు మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 1,15,028 (74.81శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

వీరిలో 23,623 మంది ఇన్‌సర్వీస్ టీచర్లుండగా, మిగిలిన 91,405 మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులున్నారు. ఉత్తీర్ణులైన వారిలో 8,809 మంది ఇన్‌సర్వీస్ టీచర్లుండగా, మిగిలిన వారు 41,735 మంది ఉన్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లు 37.29 శాతం మంది అర్హత సాధించగా, ఇతరులు 45.66 సాధించారు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో ఇన్‌సర్వీస్ టీచర్లు 28,151 మంది కాగా, పరీక్షకు హాజరైన వారు 23,623 మంది. వీరిలో ఉత్తీర్ణత సాధించిన వారు కేవలం 8,809 మంది మాత్రమే. అంటే మిగిలిన 14,814 మంది టెట్‌లో ఫెయిల్ అయ్యారు.

పేపర్1లో అత్యధిక శాతం ఉత్తీర్ణత 

పేపర్1కు 50,113 మంది దరఖాస్తు చేసుకోగా 36,129 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అర్హత సాధించిన వారు 23,590 (65.29 శాతం) మంది ఉన్నారు. పేపర్2 (మ్యాథ్స్)కు 58,675 మంది దరఖాస్తు చేసుకోగా, 44,128 మంది పరీక్ష రాయగా, 17,987 (40.76 శాతం) మంది మాత్రమే పాసయ్యారు. పేపర్2 (సోషల్)కు 44,964 మంది దరఖాస్తు చేసుకుంటే 34,771 మంది పరీక్ష రాయగా, 8967 (25.79 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. టెట్ ఫలితాల్లో పేపర్1లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొదటి స్థానం, పేపర్2లో భద్రాద్రికొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి.

21న ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్

ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. అందుకోసం ఈ నెల 21న నోటిఫికేషన్‌ను జారీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11వరకు ఇన్‌సర్వీస్ ఉపాధ్యా యులకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ టీచర్లక కూడా టెట్ అర్హత తప్పనిసరన్నారు. పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫా మ్‌లు మొత్తం పంపిణీ చేశామన్నారు. 2024 లోనే డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, మరో డీఎస్సీకి సమయం పడుతుందన్నారు.