జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన
పాల్వంచ, జులై 13, (విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రం (మెమోరాండం) సమర్పించారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి సంక్షేమం, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రధాన డిమాండ్లు: జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి. ఆరోగ్య బీమా పథకాన్ని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న అక్రిడేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి.
అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు బీమా సౌకర్యాన్ని కల్పించాలి. జర్నలిస్టులకు రైల్వే పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలి. ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యాన్ని అందించాలి. జర్నలిస్టుల సంక్షేమ నిధిని బలోపేతం చేయాలి. జర్నలిస్టుల భద్రతకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి. మీడియా స్వేచ్ఛను పరిరక్షిస్తూ జర్నలిస్టుల హక్కులను కాపాడాలి. ఈ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ నాయకులు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు.






