14 July, 2026 | 3:54 AM

భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు

14-07-2026 01:59 AM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాశైవాక్షయోగం సందర్భంగా ప్రత్యేక పూజలు

భూపాలపల్లి/మహబూబాబాద్, జులై 13 (విజయక్రాంతి): శత వసంతాలకు ఒకసారి వచ్చే మహాశైవాక్షయోగం సందర్భంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. విశిష్టమైన ఈ రోజున శివాలయాల్లో శివలింగానికి వృద్ధాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎంతో శ్రేయస్కరమని భావించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, గణపురం కోటగుళ్లు, కాట్రపల్లి శివ కోటేశ్వరాలయంతో వివిధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

తెల్లవారుజామునుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు.ఆయా దేవాలయాల్లో శివలింగాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి శివ కోటేశ్వరాలయంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మె ల్యే డాక్టర్ భూక్యా మురళి తదితరులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం నాలుగున్నర కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.