14 July, 2026 | 3:54 AM

బనకచర్లపై తెలంగాణకు ఎదురుదెబ్బ

14-07-2026 01:14 AM
  1. ఏపీకి తక్షణ నోటీసులకు సుప్రీంకోర్టు నిరాకరణ
  2. ఒరిజినల్ సూట్‌లో ప్రక్రియాపరమైన లోపాలు
  3. సరిచేస్తేనే విచారణకు స్వీకరిస్తామన్న సుప్రీంకోర్టు
  4. తెలంగాణ విజ్ఞప్తులను అంగీకరించని ధర్మాసనం
  5. పిటిషన్‌ను సవరించునున్న రాష్ట్ర ప్రభుత్వం
  6. జల హక్కులపై న్యాయపోరాటం కొనసాగింపు

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి తాత్కాలికంగా ఎదురుదెబ్బ తగిలింది. పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని, బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీకి తక్షణ నోటీసులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ వేసిన ఒరిజినల్ సూట్‌లో ప్రక్రియాపరమైన లోపాలను సరిదిద్దుతేనే తదుపరి విచారణ ఉంటుందని తేల్చిచెప్పింది. తెలంగాణ చేసిన విజ్ఞప్తులను అంగీకరించలేదు. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిబంధనలను కూడా ధర్మాసనం ప్రస్తావిస్తూ.. రూల్స్ పాటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం న్యాయపరంగా సాధ్యం కాదని రాష్ట్రప్రభుత్వానికి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది.

జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి పనులూ చేపట్టకుండా తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ఈ దశలో సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బనకచర్ల ప్రాజెక్టుకు చట్టబద్ధ అనుమతులు లేకుండానే ముందుకు తీసుకెళ్తున్నారని, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర జలహక్కులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు అమలైతే గోదావరి జలాల పంపిణీపై ప్రభావం పడటమే కాకుండా భవిష్యత్‌లో తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాలు కూడా దెబ్బతింటాయని వాదించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని కోర్టుకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూ సీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) వంటి సంబంధిత సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందలేదని వాదించారు.

అన్ని చట్టబద్ధ అనుమతులు పూర్తికాకముందే ప్రాజెక్టు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నందున సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని, అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధర్మాసనం ఈ వాదనలను పరిశీలించిన అనంతరం, ప్రస్తుతం దాఖలైన ప్రధాన పిటిషన్‌లోనే ప్రక్రియాపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంది.

ఆ లోపాలను సరిదిద్దకముందు పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒరిజినల్ సూట్‌కు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌లోని లోపాలు తొలగించకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం న్యాయపరంగా సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

లోపాలను సరిదిద్దండి

సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిబంధనలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. రిజిస్ట్రీ రూల్స్ ప్రకారం.. ఇటువంటి ఒరిజినల్ సూట్ పిటిషన్లు ముందుగా చాంబర్ జడ్జి పరిశీలనకు వెళ్లాలని, అక్కడ అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ధర్మాసనం ఎదుట విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఈ కేసులో ఆ ప్రక్రియ పూర్తికాకముందే నేరుగా ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చినట్లు గుర్తించిన కోర్టు, నిబంధనల కు అనుగుణంగా ముందుగా లోపాలను సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని కోర్టుకు తెలిపారు. అయితే ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరించకముందే వారికి నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

పిటిషన్‌లోని లోపాలు సరిదిద్దిన తర్వాత విచారణ చేపట్టి, అవసరమైతే నోటీసులు జారీ చేయాలా లేదా అన్న అంశంతో పాటు మిగిలిన అన్ని విషయాలనూ పరిశీలిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరిన తక్షణ ఉపశమనం లభించలేదు. అయినప్పటికీ పిటిషన్‌ను కొట్టివేయకుండా, లోపాలను సరిదిద్దుకునే అవకాశం కల్పించడం గమనార్హం. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణీత ప్రక్రియ ప్రకారం పిటిషన్‌ను సవరించి మళ్లీ కోర్టు ముందుకు తీసుకురానుంది.

బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జలాల వినియోగం, రాష్ట్రాల జలహక్కులు, పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు వంటి కీలక అంశాలకు సంబంధించినదిగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో తమ న్యాయపోరాటాన్ని కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.