11 July, 2026 | 2:44 AM

పోడు భూముల సమస్యపై 13న చలో ఐటీడీఏ..

11-07-2026 01:48 AM

సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

భద్రాచలం, జులై 10,(విజయక్రాంతి): గిరిజనుల సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టాలు ఇవ్వాలని, పోడుసాగుదారులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని ఈనెల 13వ తేదీన చలో ఐటిడిఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం స్థానిక చందర్రావు భవనంలో సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావుతో కలిసి మచ్చ మాట్లాడారు.

ఎన్నోఏళ్లగా గిరిజనులు సాగు చేసుకుంటున్నా పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు అనేక రకాల నిర్బంధాలను సృష్టిస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, గిరిజనుల సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని మచ్చ డిమాండ్ చేశారు. పోడు సమస్యలపై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో ఐటిడిఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ చలో ఐటిడిఏ కి జిల్లా వ్యాప్తంగా పోడుసాగుదారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. 

యుద్ధ ప్రాతిపదికన కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టాలి

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు తప్పదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేసిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన భద్రాచలం కరకట్ట నిర్మాణ పనులను చేపట్టాలి. ఇప్పటికే పలుమార్లు పోలవరం ముంపు పై అధ్యయనం చేసిన అధికారులు భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముంపు ఉంటుందని స్పష్టం చేశారన్నారు. పట్టణ వ్యాప్తంగా ఉన్న స్లూయిజ్లలను మరమ్మత్తులు చేసి ప్రతిస్లూయిజ్ వద్ద జంబో మోటార్లను ఏర్పాటు చేయాలనారు.

ఆదివాసి హక్కులను కాలరాస్తున్న పాలకులు..!

దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలనలో ఆదివాసి హక్కులు కాలరాయపడుతున్నాయి అని డాక్టర్ మిడియం బాబురావు ఆరోపించారు. గిరిజనులను అడవులకు దూరం చేసే కుట్రలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. బాక్సైట్ మైనింగ్ తవ్వకాల కోసం కార్పొరేట్ రంగాలవారి ప్రయోజనాల కోసం ఆదివాసి ప్రజలను అడవులకు దూరం చేసే కుట్రలను మోదీ సర్కార్ చేపట్టిందని ఆరోపించారు. షెడ్యూల్ ఏరియాలలో ఆదివాసీ హక్కులు చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు.

ఐటీడీఏలకు నిధులను కోత పెట్టి నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారు అని అన్నారు. పోడు భూముల సమస్యపై 13 తారీకున జరిగే చలో ఐటిడిఏ కి పెద్ద సంఖ్యలో ఆదివాసి పోడుదారులు తరలిరావాలని మిడియం బాబురావు పిలుపునిచ్చారు. ఈ  సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ .జే.రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి .నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.