28 August, 2026 | 2:21 AM

ఎట్టకేలకు ఫలించిన... జవహర్ నగర్ పేదింటి కలలు

28-08-2026 01:14 AM

జవహర్ నగర్ పరిధిలోని 58, 59 జీవోల ఇండ్లకు నిర్మాణ అనుమతి

58, 59 జీవోల వారికి కొత్త ఇంటి నెంబర్లకు పచ్చ జెండా

మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఎట్టకేలకు జవహర్ నగర్ వాసుల గృహ నిర్మాణ కష్టాలు తీరనున్నాయి.... అదిగో ఇదిగో అని ఎదురుచూస్తున్న మంచి రోజులు రానే వచ్చాయి. జవహర్ నగర్ పరిధిలోని, గ్రామకంఠం, 58, 59 జీవోల నిర్మాణానికి అనుమతులు దక్కనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇంటి నిర్మాణాల అనుమతుల కోసం ఎదురుచూస్తున్న జవహర్ నగర్ వాసుల పేద" ఇంటి" కష్టాలు తీరబోతున్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ జవహర్ నగర్ వార్డు యందు మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ కృష్ణారెడ్డి గురువారం తన సిబ్బందితో పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ గ్రామకంఠం పరిధిలోని ఉన్న గృహాలకు 58, 59 పట్టాలు ఉన్నటువంటి గృహాలకు గృహాలకు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతిని ఇచ్చామని తెలిపారు. అలాగే జవహర్ నగర్ చంద్రపురి కాలనీ పరిధిలోని 58 ,59 పట్టాలు ఉన్నటువంటి ఇండ్ల హక్కుదారులకు కొత్త ఇంటి నెంబర్లు తీసుకొనుటకుగాను అనుమతిని ఇచ్చామని తెలిపారు. అనంతరం ఆయన ఎస్ఆర్వో, రెవెన్యూ అధికారులతో మాట్లాడి జవహర్ నగర్ పరిస్థితులను సమీక్షించారు. జవహర్ నగర్ వాసులు పడుతున్న నిర్మాణ కష్టాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను జవహర్ నగర్ లో అమలు చేయడం ముదాబావమన్నారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ సంక్షేమ పథకాలలో ముందు నిలవడం అభినందనీయమన్నారు. కీసర సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల అభివృద్ధియే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తద్వారా కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో దోమల నివారణకు పెద్ద ఎత్తున మున్సిపల్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని దీనికి ప్రజల సహకారం తోడ్పాటు ఎంతో అవసరమన్నారు.

శుభ్రత పరిశుభ్రత లో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జవహర్ నగర్ వాసుల ఇంటి కష్టాలు ఇకపై తీరని ఉన్నాయని, ప్రజలు జవహర్ నగర్ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం, మున్సిపల్ అధికారులు, చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, నాయకులు కల్లేపల్లి సదానంద్, మనోధర్ రెడ్డి, నాయకం భాస్కర్, మిట్టు, బల్లి శ్రీనివాస్ గుప్తా, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.