19 August, 2026 | 2:55 AM

రామ్‌చరణ్ సరసన సారాకు ఛాన్స్?

19-08-2026 12:00 AM

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ ఇటీవల ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడాయన తన తదుపరి ప్రాజెక్ట్  ‘ఆర్‌సీ17’ కోసం సిద్ధమవుతున్నారు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ సుకుమార్, రామ్‌చరణ్ కాంబోలో రూపొందుతున్న ఈ తాజా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారని సమాచారం. అయితే, ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచే ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయమై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నయనతార, రష్మిక మందన్న, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా, ఈ చిత్రంలో నటించే హీరోయిన్ అంటూ మరో వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ ఆ ముగ్గురిని కాదని బాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ సారా అర్జున్‌కు అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ‘ధురంధర్’ సినిమాతో ఓవర్ నైట్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మను రామ్‌చరణ్ సరసన కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. సుకుమార్ ఇప్పటికే సారా అర్జున్‌కు కథ వినిపించారని, దాదాపుగా ఈ కాంబినేషన్ ఖరారైనట్టేననేది ఇండస్ట్రీ వర్గాల్లో వినవస్తున్న టాక్. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని చర్చించుకుంటున్నారంతా.