19 August, 2026 | 4:29 AM

రాజీనామా చేయాలి

19-08-2026 01:17 AM
  1. నిషేధిత భూముల తప్పిదానికి ఆయనదే నైతిక బాధ్యత 
  2. ప్రజల భూములు జాబితాలో పెట్టింది ఎవరు? 
  3. తప్పు చేసి అధికారులపై నెపం సరికాదు 
  4.    22 ఏ జాబితాను వెంటనే రద్దు చేయాలి 
  5. కబ్జా భూములను క్రమబద్ధీకరిస్తే ఊరుకోం 
  6. మాజీమంత్రి హరీశ్‌రావు మండిపాటు

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదవికి రాజీనామా చేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజల భూములను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి, ఇప్పు డు ఆ తప్పును అధికారులపై నెట్టడం సరికాదన్నారు. అసలు భూములను జాబితాలో చేర్చింది ఎవరు? ఆదేశించింది ఎవరు? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

తప్పు జరిగిందని సారీ చెబితే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 30 శాతం భూమి ఇవ్వాలని, డెవలప్‌మెంట్ హక్కులు కూడా ఇవ్వాలని అడుగుతు న్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

22ఏ నిషేధిత భూముల జాబితాను వెంటే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మల్కాజ్‌గిరిలో బాధితులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు.  సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభు త్వం కొత్త ఇబ్బందులను సృష్టిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22 నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలా? అని నిలదీశారు.

రంగారెడ్డి జిల్లాలో జీఓల ద్వారా మినహాయింపు పొందిన  7,500 ఎకరాల భూములు, మేడ్చల్ జిల్లాలో 6 వేల ఎకరాలకు పైగా భూములు,హెచ్‌ఎండీఏ, హుడా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని హరీశ్ రావు ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై పట్టు సాధించేందుకే 22ఏ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నిషేధిత జాబి తాలో భూములు చేర్చినవారే, ఆ భూములను జాబితా నుంచి తొలగించాలని డిమా ండ్  చేశారు.

భూమిని అమ్మడానికి వెళ్లేవరకు అది తమదా, నిషేధిత జాబితాలో ఉం దా అనే విషయం కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. లక్షలాది స్థలాలు, ఇళ్లను జాబితాలో చేర్చారని వెల్లడించారు. తిలక్‌నగర్‌కు చెందిన అశోక్ ఉదంతాన్ని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అశోక్ తన 450 గజాల ఇంటిని అమ్మాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత అది నిషేధిత జాబితాలో ఉందని తెలిసిందన్నారు. మరుసటి రోజు అమెరికా వెళ్లేందుకు టికెట్లు కూ డా బుక్ చేసుకున్న అశోక్ పరిస్థితి ఇప్పుడు ఏమిటి? అమెరికా వెళ్లాలా? వద్దా? అక్కడ ఉద్యోగం చేయాలా? వద్దా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

అధికారులపై నెట్టి తప్పించుకోవద్దు

ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చి, ఇప్పుడు ఆ తప్పును అధికారులపైకి నెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని హరీశ్‌రావు మండిపడ్డారు. తప్పు చేసిది మీరు, ప్రజలు దరఖాస్తు చేసుకోవాలా? అని ప్రశ్ని ంచారు. మంత్రి పొంగులేటి బాధ్యత వహిం చి నిషేధిత జాబితా నుంచి ప్రజల భూములను తొలగించాలని డిమాండ్ చేశారు.  ప్ర భుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ కూడా పనిచేయడం లేదని విమర్శించారు. ఇది ఎంత దగా ప్రభుత్వం? అని హరీశ్  విమర్శించారు. 

ముఖ్యమంత్రికి సారీ చెప్పలేదా.. పొంగులేటి?

ముఖ్యమంత్రి నివాసం కూడా 22 ఏ పరిధిలో ఉందన్న అంశాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు. ఒక వేళ సీఎం ఇంటి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే.. ఆయనకు పొంగులేటి సారీ చెప్పలేదా? అని ప్రశ్నించారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలతో పాటు తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, దీనిపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

22 ఏ జాబితా తొలగింపులో పారదర్శకత ఉండాలని, నిజమైన భూ హక్కుదారుల భూములను మాత్రమే తొలగించాలని స్పష్టం చేశారు. 22ఏ ముసుగులో అక్రమంగా ఆక్రమించిన లేదా వివాదాస్పద భూములను తొలగిస్తే మాత్రం బీఆర్‌ఎస్ ఊరుకోదు అని హరీశ్‌రావు హెచ్చరించారు. 

అధికారులూ.. మీరు బలికావొద్దు   

‘సీఎం, మంత్రుల ఆదేశాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జాబితాలు మార్చడం సాధ్యమా?. వారు చెప్పినట్లు చేస్తే చివరకు మీరు ఇరుక్కుంటారు. ముక్కుసూటిగా వ్యవహరించండి. తప్పు చేసి బలికావొద్దు’ అని అధికారులకు హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మంత్రి చేసిన తప్పులకు సీఎం చర్యలు తీసుకోకపోతే.. ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా ఈ భూదందా చేశారనే అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతాన్నారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తప్పుచేసిన కాంగ్రెస్ నాయకులను చట్టపరంగా బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు.

ఈ అంవంపై అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లోని జనతా గ్యారేజీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరికైనా సమస్య ఉంటే రండి.. మీకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రద్దుకు కుట్ర

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయకుండా కావాలనే నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 2,600 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.

కల్యాణలక్ష్మి ఇప్పుడు సంతానలక్ష్మిగా మారిందని, పెళ్లి సమయంలో అందాల్సిన సాయం పిల్లలు పుట్టిన తర్వాత వస్తోందని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి విషయంలో అధికారుల తప్పిదమని మంత్రి పొన్నం ప్రభాకర్  అంటున్నారు, ఎక్కడా ఇరుక్కోకుండా ముక్కుసూటిగా వ్యవహరించాలని సూచించారు. 

సర్వేయర్ల అరెస్టు అప్రజాస్వామికం 

డిమాడ్ల సాధన కోసం సర్వే భవన్ వద్ద శాంతియుత నిరసన చేస్తున్న సర్వేయర్లను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని హరీశ్ రావు పేర్కొన్నారు. మంగళ వారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది లైసెన్స్‌డు సర్వేయర్లకు ఏడాది కాలంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు.

వారు ఎలా జీవించాలి? కుటుంబాలను ఎలా పోషించాలి? అని ప్రశ్నించారు. అరెస్టులతో సర్వేయర్ల గొంతును అణచివేయడం తగదన్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, తక్షణమే చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.