19 August, 2026 | 2:57 AM

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే షురూ

19-08-2026 01:55 AM

సీపీ.. డీసీపీల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పర్యవేక్షణ

ఏడాదిన్నరపాటు కొనసాగనున్న ఆంక్షలు

వాహనదారులు సహకరించాలని సీపీ సజ్జనార్ వినతి

బంజారాహిల్స్, ఆగస్టు 18 (విజయక్రాంతి): హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన పనులు వేగవంతం అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కింద 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లను నిర్మిస్తున్నారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు నగర పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ జిహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వికర్ణన్ తో కలిసి పార్క్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. ఉదయం 6 గంటల నుంచే వన్ వే విధానం అమలైన నేపథ్యంలో ఎస్‌ఆర్డీపీ పనులు. వన్ వే ఆంక్షల అమలును స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ఇప్పటికే 15 పిల్లర్ల పనులు జరుగుతున్నాయన్నారు. వన్ వే అమలుతో మరో 40 పిల్లర్ల పునాదులు వేసేందుకు ఆటంకాలు తొలగిపోయాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీ కాజల్ సింగ్ పర్యవేక్షణలో నాలుగు షిఫ్ట్లలో 1,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెం.45 మీదుగా ఐటీ కారిడార్కు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం ఆసుపత్రి, ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెం.45 చేరుకుని అక్కడి నుంచి ఐటీ కారిడార్కు చేరుకోవచ్చన్నారు. ఏడాదిన్నర పాటు ఆంక్షలు కొనసాగనున్నందున వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని విన్నవించారు.