19 August, 2026 | 3:52 AM

సర్కారు కీచక దందా

19-08-2026 01:06 AM
  1. ‘ధరణి’ పోయినా.. ధోరణి మారలేదు 
  2. పేదల భూములకు రాత్రికి రాత్రే ఫెన్సింగ్, వేలానికి కుట్ర 
  3. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ 
  4. కూకట్‌పల్లిలో రూ.20 వేలకోట్ల భూముల బదిలీపై ఫైర్
  5. రెవెన్యూ శాఖను ‘రాబరీ మినిస్ట్రీ’గా మార్చారు 
  6.    22 ఏ జాబితాను ‘కలెక్షన్ సెక్షన్’గా మార్చారు 
  7. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ‘పేదల భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే, వాటిపై కన్నేసింది. సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ తరహాలో వ్యవహరిస్తూ లక్షల కోట్ల రూపాయల భూదందాకు తెరతీశారు’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ‘ధరణి’ పోయినా ప్రభుత్వ ధోరణి మారలేదని, ‘భూభారతి’పేదల పాలిట ‘భూహారతి’గా మారిందని ఎద్దేవా చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే భూ సమస్యలన్నీ తీరి పారదర్శకమైన చట్టం వస్తుందని ప్రజలు ఆశిస్తే, గత కేసీఆర్ ప్రభు త్వం ధరణి పేరుతో పేద రైతుల హక్కులను కాలరాసిందని విమర్శించారు. ధరణి రాకముందు పహాణీ ల్లో ఉన్న 13 కాలమ్స్(ముఖ్యంగా కబ్జా, కాస్తు కాల మ్స్) తొలగించడం వల్ల 50--70 ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్న దళితులు, గిరిజనులు, బీసీ పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి, ఇప్పుడు ’భూభారతి’ పేరుతో పేద రైతులను అగాథంలోకి నెట్టిందని మండిపడ్డారు. గత సీఎం కేసీఆర్ కంటే ప్రస్తుత సీఎం రేవంత్ పది అడుగులు ముందుకేసి భూముల వేలం ద్వారా దాదాపు రూ.10 లక్షల కోట్లు సమకూర్చుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని ధ్వజమెత్తారు.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో వేల ఎకరాల పేదల భూములను హైడ్రా, పోలీసుల పహారాతో రాత్రికి రాత్రే ఫెన్సింగ్‌లు, ప్రహరీలు నిర్మించి డీల్స్‌కు అప్పగిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే.. గ్రామాలపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా భూదందాలు   

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భూదందాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రైవేట్ భూముల్లో 12 ఏళ్లు కౌలు ఉంటే ‘సెక్షన్ 38ఈ’ కింద భూ హక్కులు వస్తున్నాయని.. కానీ, బడంగ్‌పేట్‌లో ఐదు తరాలుగా (78 ఏళ్లుగా) 46 మంది రైతులు సాగు చేసుకుంటున్న 45 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి పేరుతో లాక్కుంటున్నారని పేర్కొన్నారు. దుండిగల్‌లో సర్వే నంబర్‌లో 452, 453లలో 400 ఎకరాల్లో 500 మం ది రైతులు, బోరంపేట సర్వే నం.

166లోని 440 ఎకరాల్లో 150 మంది రైతులు 80 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్నారని, బలవంతంగా వారి నుంచి భూములు గుంజుకుం టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌరంపేట సర్వే నం.472లోని 30 ఎకరాల చుట్టూ గోడలు నిర్మించారని, బొమ్మరాజుపేట(శామీర్‌పేట్)లో 1965 నాటి 1,049 ఎకరాల భూమి ధరణి లోపాల వల్ల వివాదంలోకి వెళ్లగా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చా క 24 గంటల్లోనే పేర్లు మార్చి రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు.

శంషీగూ డా  మ్మబండ)లో సర్వేనం. 57లోని 333 ఎకరాల్లో పేదలు, జర్నలిస్టులకు ఇచ్చిన 176 ఎకరాలు కాకుం డా మిగిలిన 90 ఎకరాల భూమిని (విలువ సుమారు రూ.3,000 కోట్ల నుంచి రూ. 4,000 కోట్లు) కోర్టు కేసులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులతో సెటిల్ చేసుకున్నా రని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో ఇండియన్ డిటనేటర్స్ లిమిటెడ్ పేరిట ఉన్న 330 ఎకరాల పైచిలుకు భూమిని (విలువ రూ.20,000 కోట్లు) ఫినిక్స్ కంపెనీ మధ్యవర్తిత్వంతో చేతులు మారిందని, ఇక్కడి నుంచే 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అక్రమ డబ్బు ఖర్చు పెట్టిందని ఆరోపించారు.

బహదూర్ గూడ (ఫ్యూచర్ సిటీ)లో 70--80 ఏళ్లుగా గులాబీ తోటలు సాగుచేసు కుంటున్న రైతుల నుంచి 650 ఎకరాలను హైడ్రా బలగాలతో లాక్కోవాలని చూస్తే, ప్రజలు కారం చల్లి తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ఎంకేపల్లిలో 200 ఎకరాలు, అజీజ్‌నగర్‌లో 70 ఎకరాలు, హిమాయత్‌నగర్‌లో పేదల 60 గజాల ప్లాట్లు, కోయడలో 246 ఎకరాలు, సీతారాంపూర్ వెంకటేశ్వర స్వామి భూములు 1,200 ఎకరాలు, అంబేద్కర్ నిధి కింద ఇచ్చిన 20 ఎకరాల కోళ్ల ఫా రాల భూములను సైతం ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో బీజేపీ నేతలు ఆలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ పేదల పక్షాన పోరాడి అడ్డగుట్ట, వారాసిగూడ, వాజ్‌పేయి నగర్, దత్తాత్రేయ నగర్, దీన్‌దయాళ్ నగర్ బస్తీలను ఏర్పాటు చేయించారని, నేడు కూడా పేదల భూముల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి  భూ దందాలు  మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మించడంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

భూదందాకు సర్కార్ స్కెచ్:  ఏలేటి 

రాష్ట్రంలో 22ఏ జాబితాను అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల భూదందాకు ప్రభుత్వం స్కెచ్ గీసిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనలో రెవెన్యూ శాఖ ‘రాబరీ మినిస్ట్రీ’గా, 22ఏ సెక్షన్ ‘కలెక్షన్ సెక్షన్’గా మారిందని మండిపడ్దారు.  హైదరా బాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రూ.లక్ష కోట్ల విలువైన ప్రైవేటు ఆస్తులు 22ఏ జాబితాలోకి వెళ్లాయని, రాష్ట్రవ్యాప్తం గా కోటి ఎకరాల వరకు ఉంటాయని తెలిపారు.

బీఆర్‌ఎస్ హయాంలో 22ఏ జాబితా లో ఉన్న భూమి ఎంత? కాంగ్రెస్ వచ్చిన త ర్వాత ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది?  శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీనిక్స్ కంపెనీ నుంచి మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, నోవా తదితర కంపెనీలకు సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు బది లీ అయ్యాయని ఆరోపించారు.

ఫైనాన్షియ ల్ డిస్ట్రిక్ట్‌లోని ఏడు ఎకరాల భూమి, కోకాపేటలోని 61 అంతస్తుల కమర్షియల్ కాం ప్లెక్స్, హైటెక్ సిటీలో 12 ఎకరాల్లోని కమర్షియల్ టవర్లు, కందుకూరు ప్రాంతంలోని 400 ఎకరాలు, గాజులరామారంలోని 30 ఎకరాల భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ఫీనిక్స్ టెక్ జోన్‌కు భూమి కేటాయించిన మరుసటి రోజే రాఘవ కన్స్ట్రక్షన్స్‌తో నిర్మాణ ఒప్పం దం ఎలా జరిగిందని ప్రశ్నించారు.

రూ.15 వేల కోట్ల ఆస్తుల బదిలీ వెనుక ఉన్న వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీనిక్స్ నుంచి పొంగులేటి కుటుబం  కంపెనీలకు ఆస్తులు బదిలీ కావడం కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య ఉన్న ‘ఉమ్మడి దోపిడీ’కి నిదర్శనమని ఆరోపించారు.

తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి భాగస్వామ్యం లేదని నిరూపించుకోవాలంటే సీఎం వెంటనే లోకాయుక్త విచారణకు ఆదేశించాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్, హరీష్‌రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రి కాకముందు తన ఆస్తులు ఎంత, మంత్రి అయ్యాక ఎంత పెరిగాయో స్పష్టం చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.