4 June, 2026 | 3:10 AM

తొలకరికే తొందరొద్దు..

04-06-2026 02:23 AM
  1. మలి వానలు మాయమవ్వొచ్చు!
  2. మొదటి జల్లుకి కాదు నిలకడైన వానకే విత్తనం విత్తుకోవాలి
  3. పొంచివున్న ఎల్ నినో ముప్పు
  4. సాగు పద్ధతుల్లో మార్పులతోనే నష్టాలకు చెక్
  5. పుడమి పులకరింపుకి రైతుల ఎదురుచూపు
  6. సమృద్ధిగా వానలు కురుశాకే విత్తనాలు విత్తుకోవాలంటున్న నిపుణులు

మునుగోడు, జూన్ 3: వానాకాలం ప్రారంభమవుతుండటంతో తొలి జల్లులు కురిసిన వెంటనే విత్తనాలు వేయాలనే ఆత్రుత రైతుల్లో కనిపిస్తోంది. అయితే ఈసారి అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టాలకు దారితీసే ప్రమాదం ఉందని వాతావరణ, వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు క్రమం తప్పే అవకాశం ఉండటంతో, స్థిరమైన వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయాలని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మే నెలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసినా, జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాల పంపిణీ అసమానంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల ప్రభావం రైతులపై పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తొలి వర్షం తర్వాత పెద్ద విరామం వచ్చే అవకాశం ఉండటంతో నేల కనీసం 3 నుంచి 5 అంగుళాల లోతు వరకు తడిసిన తర్వాతే విత్తనాలు వేయాలని సూచిస్తున్నారు. లేకపోతే మొలకలు ఎండిపోయి రైతులు రెండోసారి విత్తనం వేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మునుగోడు డివిజన్ లో 1.50 లక్షల ఎకరాల సాగు లక్ష్యం:

మునుగోడు, చండూర్, నాంపల్లి, మర్రిగూడ, గట్టుపల్ లో ఈ వానాకాలంలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి, వరి, కంది, పెసర, వేరుసెనగ, ఆముదం, మొక్కజొన్నతో పాటు ఉద్యాన పంటలు కూడా విస్తృతంగా సాగు కానున్నాయి.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’తో అవగాహన..:

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించుకునేందుకు ప్రభుత్వం ఇటీవల రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల బృందాలు పర్యటించి ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, నీటి యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించాయి. ఈ పరిస్థితులను అన్నింటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఈసారి సమృద్ధిగా వానలు కురిసిన తర్వాతే విత్తనాలు నాటుకోవాలని అప్పుడే సాగుచేసిన పంట నుంచి మంచి ఫలితాలు సాధించగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.

నిరుడు రోహిణి కార్తెలోనే విత్తనాలు పెట్టాం 

నిరుడు రోహిణి కార్తె వానలు అనుకూలంగా కురవడంతో పత్తి విత్తనాలు పెట్టాం. నేలలో తగినంత తేమ ఉండటంతో పంట మొక్కలు కూడా ఆశాజనకంగా వచ్చాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. రోహిణి కార్తె ముగియవచ్చినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వానలు కురవలేదు. దీంతో చాలా మంది రైతులు ఇప్పటికీ దుక్కులు కూడా దున్నలేదు. రోహిణి కార్తెని రైతులు బలమైన కార్తెగా భావిస్తారు. వానాకాల సాగుకు శ్రీకారం చుట్టేది ఈ కార్తెలోనే. కానీ ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. నిలకడైన వానలు కురిసిన తర్వాతే సాగు పనులు ప్రారంభిస్తాము.

కొలను శేఖర్ రెడ్డి, రైతు, మునుగోడు

 తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి పెట్టాలి 

ఈసారి నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే పంటల కంటే తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల ఎంపిక, విత్తనాలను విత్తడం చేయాలి. మూస ధోరణిలో కాకుండా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలి. నిలకడైన వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు విత్తుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచి నిర్ణయం.

బి.వేణుగోపాల్, 

సహాయక వ్యవసాయ సంచాలకులు, మునుగోడు