19 April, 2026 | 5:24 PM

కొల్కూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా సదాశివుడి 21వ రథోత్సవం

19-04-2026 03:53 PM

సదాశివపేట: కొల్కూర్ గ్రామంలో శ్రీ సదాశివుడి, 21వ వార్షిక రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొని, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం ఆలయ ప్రధాన వీధుల్లో రథోత్సవం ప్రారంభమైంది. అలంకరించిన రథంపై సదాశివ స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తుండగా భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు  చేస్తూ గ్రామస్తులు, యువత పెద్దఎత్తున పాల్గొని రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు.

మహిళలు మంగళహారతులతో స్వామివారిని ఆహ్వానించగా, చిన్నారులు సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్బంగా సదాశివుడి దేవాలయం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణి చేశారు. ఉత్సవాలను వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రథోత్సవం శాంతియుతంగా, విజయవంతంగా ముగియడంతో గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఈ ఉత్సవాలు ఆదివారం మొదలుకొని మంగళవారం వరకు మూడు రోజులు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.