చారిటీ ముసుగులో చీటింగ్
- విరాళాల పేరుతో రూ.300 కోట్లు సేకరణ
- ఆపరేషన్ మొబిలిటీ చారిటీ నిర్వాకం
- 21, 22 తేదీలలో దాడులు నిర్వహించిన ఈడీ
- మంగళవారం అధికారికంగా వెల్లడి
- మనీలాండరింగ్ కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. విదేశాల నుంచి సేకరించిన విరాళాలను పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఆపరేషన్ మొబిలిటీ(ఓఎమ్)పై ఈ నెల 21, 22 తేదీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు జరిపి మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని మంగళవారం ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. సీఐడీలో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు హైదరాబాద్‌తో సహా 11 చోట్ల సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఓఎమ్ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి సుమారు రూ.300 కోట్లు సేకరించినట్లు ఈడీ పేర్కొంది.
విదేశాల నుంచి నిధుల సేకరణ..
ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, యూఎస్, కెనడా, యూకే, బ్రెజిల్, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, రుమేనియా, మలేషియా, సింగపూర్, నార్వే సహా పలు దేశాల నుంచి నిధులు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. తాము నిర్వహిస్తోన్న సుమారు 100 స్కూళ్లలో చదువుతున్న ఎస్సీ, అనాథ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని ఈ విరాళాలు సేకరించినట్టు అధికారులు గుర్తించారు. విరాళాలను పక్కదారి పట్టించిన సదరు సంస్థ, స్కూళ్లలోని విద్యార్థుల వద్ద రూ. వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు గతంలో గుర్తించారు. విరాళాల ద్వారా ఓఎమ్ సంస్థ తెలంగాణ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కేరళలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లో 11 చోట్ల రెండ్రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, బినామీ కంపెనీల లావాదేవీల వివరాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.






