దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి
తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తూ, వారికి పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన 94 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఇతర సహాయ ఉపకరణాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డిడబ్ల్యూవో విశ్వజలతో కలిసి చైర్మన్ ముత్తినేని వీరయ్య లబ్ధిదారులకు పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దివ్యాంగుల కోసం ఇంత విస్తృత స్థాయిలో ట్రై సైకిళ్లు, మోటార్ స్కూటర్లు, బ్యాటరీ వీల్చైర్లు, ఇన్నోవేటివ్ వీల్చైర్లు, బ్యాటరీ సైకిల్ బిజినెస్ కార్ట్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, బిజినెస్ ఆటోలు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పించే ఫ్పు తొలి సంతకం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. అదేవిధంగా, దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా తొలి సంతకం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిందని, విద్య, వైద్య రంగాలలో కూడా వారికి ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద అదనంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో 75 శాతం వైకల్యం ఉన్నవారికే పరికరాలు అందించేవారని, ప్రస్తుతం 40 శాతం వైకల్యం ఉన్నవారికీ ఉపకరణాలు, వాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు.
దివ్యాంగుల ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా, వరంగల్కు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఒలింపిక్స్లో పతకం సాధించిన సందర్భంగా రూ.1 కోటి నగదు బహుమతితో పాటు ఉద్యోగం కల్పించినట్లు గుర్తుచేశారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజమైన పెద్దన్నగా నిలుస్తున్నారని ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, పలువురు అధికారులతో పాటు దివ్యాంగుల అసోసియేషన్ల ప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.






