అకాల వర్షంతో తడిసిన ధాన్యం!
- తూకం వేసినా కదలని మొక్కజొన్న బస్తాలు
- రోడ్ల వెంట ఆరబోసి కొనుగోళ్ల కోసం రైతన్నల ఎదురుచూపులు
- 25 రోజులుగా స్పందించని అధికారులు
- చివరికి వర్షార్పణమైన 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న
నాగర్ కర్నూల్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, వేరుసెనగ, వరిధాన్యం తడిసి ముద్దయింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తరలించగా అధికారులు కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దయింది. 25 రోజులుగా కంటికి రెప్పలా కాపాడుకున్నప్పటికీ మంగళవారం కురిసిన భారీ వర్షానికి పంట పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయింది.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చం పేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మంగళ వారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వృక్షాలు నేలకొరగడంతోపాటు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మొక్కజొన్న, వేరుశనగ పంట చేతికొచ్చిన క్రమంలో అమ్ముకోవడం కోసం రైతులంతా ధాన్యాన్ని ప్రధాన మార్కెట్లకు తరలించారు.
ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికార యంత్రాంగం మార్కెట్‌కు తరలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారులకు కొమ్ముకాస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 25 రోజులుగా ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని తూకం వేసి లారీల ద్వారా తరలించడంపై అధికారులు అలసత్వం ప్రదర్శించారు.
జిల్లాలోని ఆయా గోదాముల్లో ఇప్పటికే స్టోరేజ్ ఉన్న ధాన్యా న్ని తొలగించకపోవడం కొనుగోలు చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని భద్రపరిచేందుకు గోదాములు సిద్ధం చేయకపోవడంతో పండిన పంట పూర్తిగా తడిసిముద్దయి పనికిరాకుండా పోయింది. పంట తూకం వేసిన నుంచి తరలించేదాకా రైతులదే బాధ్యత ఉండడంతో ఆ పంటకు కాపలాగా ఇల్లు వాకిళ్లు వదిలి రైతులు మార్కెట్లోనే గడుపుతున్నారు.
అయినా మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖ ప్రాథమిక సహకార సంఘం వంటి శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని చివరికి పండించిన పంట పూర్తిగా తడిసిముద్దయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా, ఇంకా 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా మార్కెట్‌లలో రోడ్ల వెంట తడిసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేరుశెనగ పంట మాత్రం ఆయా కాంటాదారులు దళారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.






