29 April, 2026 | 3:47 AM

బీసీ కులగణనపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి

29-04-2026 02:15 AM
  1. లేదంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం
  2. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఏది?
  3. ఆ బిల్లు వల్ల మళ్లీ అగ్రకులాలకే అధికారం
  4. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

నల్లగొండ, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని, జాతీయ జనగణనలో దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇవ్వడం బీసీలను నమ్మించి మోసం చేయడమేనని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడారు.

గత ఏప్రిల్ 30న ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో ఈసారి జరిగే జాతి జనగణనలో సమగ్ర కులగనణ చేపడతామని నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే తీరా నిన్నటి నుంచి జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా కేంద్రం బీసీలను దగా చేస్తుందని ఆరోపించారు. 33 ప్రశ్నలతో రూపొందించి 34వ ప్రశ్నగా బీసీ కుటుంబాలను ఎందుకు చేర్చలేదన్నారు.

బీసీ కులాలను లెక్కించకుండా జాతి జనగణన ఎన్నిసార్లు చేపట్టిన బీసీలకు ఓరిగేది ఏమీ లేదని బీసీలకు ప్రయోజనం లేని జాతి జనగణన ఎవరికోసమని జాజుల ప్రశ్నించారు. బీసీ కులగణనపై బీజేపీ సమాధానం ఇవ్వకుంటే మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టబోయే తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మహిళా బిల్లు అడ్డుకునేవారు మహిళా ద్రోహులు అంటున్న బీజేపీ బీసీ మహిళలకు సబ్ కోట కల్పిస్తామని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.

మహిళ ఆగ్రహ సభలు నిర్వహిస్తున్న బీజేపీ ఏ మహిళల ప్రయోజనాల కోసం ఈ బిల్లు తీసుకువస్తుందో సమాజానికి తెలుసని, దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహి ళల ఆకాంక్షలను గౌరవించకుండా కేవలం 10 శాతం ఉన్న మహిళల కోసం మహిళా బిల్లు తీసుకువస్తే సహించేది లేదన్నారు.

మహిళా బిల్లు పేరుతో మరో 80 సంవత్సరాలు అగ్రకులాలే అధికారంలో ఉండాలని మహిళా బిల్లు వలన అగ్రకుల నాయకుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళా బిల్లు లబ్ధి పొందుతారని నిజమైన బీసీ మహిళలకు మహిళా బిల్లు వల్ల ఏమాత్రం లాభం లేదన్నారు.

బీసీ డిమాండ్ల సాధన కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుంకరి ఫౌండేషన్ చైర్మన్ సుంకర మల్లేష్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జెల్లా ఆదినారాయణ, హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.