01-11-2025 04:57:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): భారత దేశ గౌరవాన్ని అవమానపరిచేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మండి పడ్డారు. ఈ సందర్భంగా మీడియాకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.పాకిస్తాన్ భారత్ పై దాడి చేసినా, భారత్ ప్రతిస్పందించలేదు” అనే వ్యాఖ్యలు... భారత దేశ గౌరవాన్ని దెబ్బతీసే దుష్ప్రయత్నమే కాకుండా, మన సైనికుల త్యాగాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.
దేశం కోసం త్యాగం చేసిన వీర జవాన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా, బాధ్యత గల స్థాయిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ వేదికపై నుండి అవమానకర వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ధైర్యంగా ముందడుగు వేసింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా, భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి ప్రపంచానికి భారత శౌర్యాన్ని చూపించింది.
ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. ప్రపంచ దేశాలు కూడా భారత ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాయి. ఈ సమయంలో దేశాన్ని, దేశ సైనికుల ఆత్మ గౌరవాన్ని అవమానించే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు వెంటనే దేశ ప్రజలతో పాటు, భారత సైనికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.