కష్టంలో అండగా నిలిచిన బాల్య మిత్రులు
అనారోగ్యంతో ఉన్న 2000 బ్యాచ్ మిత్రుడికి రూ.50 వేల ఆర్థిక సాయం
చర్ల, జూలై 19: (విజయక్రాంతి): చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి -2000 బ్యాచ్ విద్యార్థి కురిచేటి రాఘవేంద్రరావు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న, సహచర మిత్రులు ఆదివారం అతని నివాసానికి వెళ్లి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న రాఘవేంద్రరావు అనారోగ్యానికి గురవడంతో తమ బాధ్యతగా భావించి సహచర మిత్రులు, మిత్రురాళ్లు అందరం కలిసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ సహాయం అందించామని తెలిపారు. తమ మిత్రుడు త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
కురిచేటి రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో తమకు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన సహచర మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడుగు రాజు, మాణిక్యాలరావు, నవీన్, మీసాల సతీష్, శోభన్ బాబు, పాపారావు, చింతా సతీష్, ఆర్. సతీష్, బాలకృష్ణ, పూజారి రమణయ్య, రవికుమార్, జనార్ధన్, జోగారావు,టి. రాజేష్, రమణాచారి, నరసింహమూర్తి తదితర సహచర మిత్రులు పాల్గొన్నారు.






