కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అర్హుడైన ప్రతి ఓటరు పేరు నమోదు అయ్యేవిధంగా సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. సోమవారం ములకలపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ నల్లపు దుర్గాప్రసాద్, అశ్వారావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తుమ్మ రాంబాబు, ములకలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జహీరుద్దీన్, కోఆర్డినేటర్ సురభి రాజేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ అమలు తీరును అధికారులు, పార్టీ నాయకులతో కలిసి సమీక్షించారు.
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.అనంతరం ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిఎల్ఏ లు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి ఓటరికి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






