2 September, 2026 | 2:06 AM

మృత్యువుతో చిన్నారుల ఆటలు

02-09-2026 | 12:00am

బృందావన్ పార్కులో పొంచి ఉన్న ప్రమాదం 

అధికారుల నిద్రమత్తుకు ప్రాణాలు బలి కావాల్సిందేనా?

శంషాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): అమాయక చిన్నారుల కేరింతలు వినపడాల్సిన ఆ స్థలంలో.. ఇప్పుడుప్రమాదం పొంచి ఉంది. అధికారులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఏ క్షణంలో ఏ ఇంట్లో విషాదం నింపుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. శంషాబాద్ డివిజన్(Shamshabad Division) 118 పరిధిలోని బృందావన్ టౌన్షిప్ చిల్డ్రన్ పార్కు(Brindavan Township Childrens Park) ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన మృత్యుకూపంగా మారింది.

పొంచి ఉన్న ముప్పు...

పార్కులోని విపరీతంగా పెరిగిన చెట్ల కొమ్మలు హైటెన్షన్ విద్యుత్ వైర్ల(High-tension power lines)ను తాకుతున్నాయి. వర్షాకాలం కావడంతో చెట్ల ద్వారా కరెంట్(Electricity) ప్రసారమై, పిల్లలు ఆడుకునే ఇనుప ఊయలలు, జారడు బల్లలకు షాక్ కొట్టే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పసిపిల్లలకు ఏం తెలుసు? అలవాటుగా ఆడుకోవడానికి వెళ్తే విద్యుత్ షాక్తో ప్రాణాలు పోయే దుస్థితి నెలకొంది.

ఫిర్యాదులు బుట్టదాఖలు.. 

పార్క్ లో విద్యుత్ తీగల ప్రమాదం గురించి స్థానిక విద్యుత్ శాఖ ఏఈ కి, మున్సిపల్ అధికారులకు కాలనీవాసులు ఎన్నోసార్లు లిఖితపూర్వకంగా స్థానికులు మొరపెట్టుకున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. ‘పెద్ద ప్రమాదం జరిగి పసికందులు బలి అయ్యాకే స్పందిస్తారా?‘ అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు.పార్కులో లైటింగ్ లేకపోవడం వల్ల రాత్రి కాగానే ఇది తాగుబోతులు, గంజాయి ముఠాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. వీధిలైట్లు వెలగకపోవడానికి కూడా ఈ విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు చెబుతున్నారు.

వెంటనే చర్యలు చేపట్టాలి

విద్యుత్ వైర్లను తాకుతున్న చెట్ల కొమ్మలను తక్షణమే నరికివేయాలి.పార్కులో హై-మాస్ట్ లేదా ఎల్‌ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. రాత్రివేళల్లో పోలీసుల పెట్రోలింగ్ పెంచి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని బృందావన్ టౌన్షిప్ వాసులు హెచ్చరిస్తున్నారు.