కదంతొక్కిన ఉద్యోగులు!
- తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన
- నల్లబ్యాడ్జీలతో సర్కారు విధానాల పట్ల భారీ స్థాయిలో నిరసన
- ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేని సీపీఎస్ ఉద్యోగులకెందుకని ప్రశ్న
- 10న ‘చలో హైదరాబాద్’ విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఆందోళన బాట చేపట్టారు. ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కారు (Congress government) నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (Telangana Employees JAC) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సచివాలయం, ఇతర కార్యాలయాలు, జిల్లా కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు మధ్యాహ్నం లంచ్ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు.
ఈ నెల 9లోపు తమ సమస్యలను పరిష్కరించకుంటే 10న చలో హైదరాబాద్ విజయవంతం చేపడతామని ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. సెక్రటేరియట్ ఉద్యోగులు సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, పూర్తి స్థాయిలో ఈహెచ్‌ఎస్ అమలు, సచివాలయంలో అన్ని క్యాడర్‌లలో ప్రమోషన్లు చేపట్టాలని, సీపీఎస్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బాహుబలి గేటు నుంచి మీడియా పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అలాగే అన్ని జిల్లాల్లోనూ నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌లోని గగన్ విహార్ వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వర్తించని సీపీఎస్ విధానం ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా13.50 లక్షల మంది ఉద్యోగులు , ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారని నేతలు తెలిపారు.
ఓపీఎస్ పునరుద్ధరించాలి: మారం జగదీశ్వర్, జేఏసీ చైర్మన్
ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు విడుదల చేయకుండా, పీఆర్సీ నివేదికను అమలు చేయకుండా ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ఈఎహెచ్‌ఎస్ సక్రమంగా అమలు కావడంలేదన్నారు.
ప్రజాప్రతినిధులకు పాత పెన్షన్ విధానమా? : ఏలూరి శ్రీనివాస రావు, జేఏసీ సెక్రటరీ జనరల్
30 సంవత్సరాలకు పైగా నిరంతరం ప్రజాసేవ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రుద్ది, కేవలం 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు మాత్రం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడం ఏ రకమైన న్యాయమని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఉద్యోగులకు ప్రభుత్వంపై ఎలాంటి కోపం లేదని, చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు ఇవ్వమని మాత్రమేఅడుగుతున్నామన్నారు.
దీనిని కోపంగా కాకుండా ఉద్యోగుల ఆక్రోశంగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. 1వ తేదీన జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, అది ఔదార్యం కాదని స్పష్టం చేశారు. నూతన ఆరోగ్య పథకం అన్ని ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా మంత్రులు, ఉన్నతాధికారులు తక్షణమే చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి: సదానందం గౌడ్, జేఏసీ కోచైర్మన్
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని జేఏసీ కోచైర్మన్ సదానంద గౌడ్ డిమాండ్ చేశారు. ఆరు డీఏలు పేరుకుపోయాయని, వాటిని ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు.
ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర కీలకం: ముజీబ్ హుస్సేన్, జేఏసీ డిప్యూటీ సెక్రెటరీ జనరల్
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తారని జేఏసీ డిప్యూటీ సెక్రెటరీ జనరల్ ముజీబ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా తొందరగా పరిష్కారించాలని డిమాండ్ చేశారు.
ఉచితాలు అడగటం లేదు: బి.శ్యామ్, టీజీవో ప్రధాన కార్యదర్శి
బి.శ్యామ్ మాట్లాడుతూ ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగస్వాములేనని, ఉద్యోగులేమి ఉచిత పథకాలు అడగటం లేదన్నారు. తాము దాచుకున్న జీపీఎఫ్, టీజీఎల్‌ఐ డబ్బులు ఎప్పుడూ అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే విడుదల చేయాలన్నారు. సెప్టెంబర్ 9 లోపు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే 10ర చలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులను కోరారు.
సీపీఎస్ ఉద్యోగుల సామూహిక సెలవులు: స్థితప్రజ్ఞ, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇటీవల సీపీఎస్ ఉద్యోగుల బహిరంగ సభలో ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 17న రాష్ట్రంలోని 2.68 లక్షల సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ విధిగా సామూహిక సెలవు పాటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఓపీఎస్ హామీని ప్రకటించిన ఈ తేదీనే సామూహిక సెలవుకు ఎంచుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆనాడు ఇచ్చిన మాటను, మా పాత పెన్షన్ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయనున్నామన్నారు.
ఉద్యోగులకు న్యాయం చేయాలి: ప్రేమ్, సచివాలయ ఉద్యోగు సంఘం
ప్రేమ్ మాట్లాడుతూ ఇప్పటికైనా ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల ఆవేదన, అసంతృప్తిని అర్థం చేసుకుని న్యాయం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. సచివాలయంలో అన్ని క్యాడర్‌లలో ప్రమోషన్లను తక్షణమే చేపట్టాలని కోరారు. ఈ నిరసనలో విక్రమ్‌కుమార్, కృష్ణా యాదవ్, శ్రీకాంత్, గండూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, కస్తూరీ వెంకటేశ్వర్లు, గిరి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ కుమార్, రమాదేవి, కిషన్ ప్రసాద్, హరికృష్ణ, నిరంజన్ రెడ్డి, శౌకత్ అలీ, సుజాత తదితరులు పాల్గొన్నారు.






