అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
బెల్లంపల్లి / తాండూర్, సెప్టెంబర్ 1 : ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కేజీబీవీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. మండలంలోని చాకేపల్లి గ్రామంలో మండల తహసిల్దార్ కృష్ణ, సర్వే అధికారులు తో కలిసి రీ సర్వే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 నాన్ కడస్టల్ గ్రామాలు, 70 కడస్టల్ గ్రామాలు మొత్తంగా 81 గ్రామాలు రీ -సర్వేకు ఎంపికయ్యాయని, తెలంగాణ సర్వే, బౌండరీ చట్టం ప్రకారం రీ - సర్వే నిర్వహించడం జరుగుతుందని, చట్టం గురించి అవగాహన కలిగి ఉండి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, గ్రామ సరిహద్దును నిర్ణయించాలని, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ సంబంధిత భూములను సాధారణ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, జి.పి.ఓ.ల ఆధ్వర్యంలో గుర్తించాలన్నారు.
అనంతరం తాండూర్ మండలం మధునాపూర్ గ్రామ శివారులో వరి సాగు చేస్తున్న రైతులతో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మండల తహసిల్దార్ జ్యోత్స్నతో కలిసి మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొనగా తమ పొలాలకు సమీపంలో చెరువు ఉందని, అందువల్లనే వరి సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు.
మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల ప్రక్రియ నిర్వహణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో తహసిల్దార్ కార్యాలయాలలో సీలింగ్ డిక్లరేషన్ను పరిశీలించి, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. భూభారతి దరఖాస్తులలో భూమి విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి చర్యలు చేపట్టాలన్నారు.






