చైనా కవ్వింపు!
భారత్‌తో మంచిగా ఉన్నట్లు నటిస్తూనే వెనుక గోతులు తవ్వే చర్యలో చైనా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. తాజాగా పాకిస్థాన్, చైనా సంబంధాలు బలోపేతమయ్యాయంటూ బలుచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టు చివరి దశకు చేరుకుందని.. ఈ క్రమంలో తన పెట్టుబడులను కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్న చైనా నేరుగా తన సైన్యాన్ని బలూచిస్థాన్ గడ్డపై దింపేందుకు సిద్ధమవుతోందని లేఖలో రాసుకొచ్చారు.
బలూచిస్థాన్‌లో చైనా సైనిక ఉనికి కేవలం స్థానిక ప్రజల సమస్య మాత్రమే కాదని, దీనివల్ల భారత్‌కు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. బలూచిస్థాన్ రక్షణ, తమ దళాల సామర్థ్యాలను బలోపేతం చేయకపోతే దీర్ఘకాలంలో చైనా దళాలు మోహరించే అవకాశముందని, ఇదే జరిగితే భారత్ సరిహద్దులో భద్రతా సవాళ్లు ఊహించని రీతిలో పెరుగుతాయని హెచ్చరించారు. బలూచిస్థాన్ రక్షణకు హానీ కలిగించే ఇలాంటి అపవిత్ర కూటమిని అడ్డుకోవడానికి భారత్, బలూచిస్తాన్ మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు.
పాక్‌తో కలిసి చైనా పన్నుతున్న కుయుక్తులను అడ్డుకోవడంలో బలూచిస్థాన్ పూర్తి మద్దుతు భారత్‌కే ఉంటుందని మీర్ యార్ బలూచ్ చెప్పడం ముదావహం. అయితే చైనా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడడం ఇదేమీ తొలిసారి కాదు. రెండు రోజుల కిందట చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. గతేడాది మేలో జరిగిన భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు చైనా మధ్యవర్తిత్వం వహించిం దంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్ సైన్యం వాడిన ఆయుధ సామగ్రిలో చైనా సరఫరా చేసినవే ఎక్కువగా ఉన్నాయని, దాని విలువ 81 శాతమని కూడా తేలింది.
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ పేర్కొన్న ప్రతీసారి భారత్ ఖండిస్తూనే వచ్చింది. ఇక బ్రహ్మపుత్ర నదిపై 15.27 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్టను నిర్మిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన చేశారు. ఈ ఆనకట్ట వల్ల బ్రహ్మపుత్రలో భారత్ వాటాకు గండిపడడంతో పాటు మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరిగే అవకాశముంటుంది.
ఈ విషయమై భారత్ గతంలోనే చైనాను హెచ్చరించింది. ఇక మనతో సరిహద్దుల్లో అకారణంగా వైరానికి దిగడం చైనాకు అలవాటే. గతంలో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణే ఇందుకు ఉదాహరణ. అంతేకాదు చైనాకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పదే పదే ప్రచారం చేసుకునే చైనా అందులోని కొన్ని గ్రామాల పేర్లు అనైతికంగా మార్చే ప్రయత్నాలు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. చైనా తలపెట్టిన ప్రాజెక్టులు, ఆనకట్టలు అన్నీ పొరుగుదేశాల హక్కులను కాలరాసేవే.
చైనా ప్రాబల్య కాంక్షవల్ల భారత్ సహా పొరుగు దేశాలన్నీ ఇబ్బందులకు గురవుతున్నాయి. మహామార్గం వన్ రోడ్డు వన్ బెల్ట్ ప్రాజెక్టు పేరిట భూటాన్, నేపాల్, తదితర పొరుగు రాష్ట్రాల్లో భూభాగాలను కాజేసే యత్నాలను చైనా ఇదివరకే ప్రారంభించింది. ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు బంగ్లాదేశ్ తమ ధోరణితో ఇబ్బంది కలిగిస్తున్న వేళ తాజాగా చైనా కూడా తోడవ్వడంతో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.






