03-01-2026 12:00:00 AM
నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి :
ఒక మహిళ చదువుకుంటే ఒక సమాజం వెలుగొందుతుంది అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం సావిత్రీబాయి ఫూలే. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిన మానవతామూర్తి. అక్షరజ్ఞానం పొందితేనే అణచివేత నుంచి విముక్తి సాధ్యమని చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రీబాయి. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, స్త్రీ స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. సావిత్రీబాయి ఫూలే 1831 జనవరి 3న మహారాష్ర్ట రాష్ర్టంలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో జన్మించారు.
జ్యోతిరావు ఫూలేతో జరిగిన బాల్యవివాహం ఆమె జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేసింది. చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన జ్యోతిరావు ఫూలే, ఆమెకు అక్షరజ్ఞానం నేర్పించడంతో పాటు పుణేలోని ఉపా ధ్యాయ శిక్షణ కేంద్రంలో చేర్పించారు. ఫలితంగా ఆమె భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా విద్యను అందించి మార్గదర్శకురాలిగా నిలిచారు. 1848లో జ్యోతిరావు ఫూలేతో కలిసి పుణేలోని భిడేవాడలో తొలి బాలికల పాఠశా లను ప్రారంభించారు.
ఆ కాలంలో బాలికలు పాఠశాలకు వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతి రేకించిన వారు సావిత్రీబాయిని ఘోరం గా అవమానించారు. పాఠశాలకు వెళ్లే దారిలో ఆమెపై రాళ్లు, మురికి నీళ్లు, పేడ నీళ్లు, బురద విసిరేవారు. అయినా ఆమె ఏ మాత్రం అధైర్యపడకుండా అపారమైన సహనంతో విద్యాబోధనను కొనసాగించారు. ఆమె పట్టుదల ముందు ‘బాలికలకు చదువు వద్దు’ అన్న సమాజమే చివరకు తలవంచింది. సావిత్రీబాయి ఫూలే కేవలం బాలికల విద్యకే పరిమితం కాకుండా, అణగారిన వర్గాల హక్కు ల కోసం కూడా నిరంతరం పోరాడారు.
సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులవివక్షను తీవ్రంగా ఖండిం చారు. అక్షరజ్ఞానం కులమత భేదాలు లేకుండా అందరికీ అందాలన్న లక్ష్యం తో ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించారు. ఆమె ఏర్పాటు చేసిన పాఠశాలల్లో అన్ని వర్గాల ఆడపిల్లలు విద్యనభ్యసించారు. సావిత్రీబాయి ఫూలే ఒక గొప్ప కవయిత్రి కూడా. ‘కావ్య ఫూలే’, ‘పావన కాశీ సుబోధ రత్నాకర్’ వంటి కవితా సంకలనాలు ఆమె కలం ద్వారా సమాజానికి అందించిన సందేశాలకు సాక్ష్యాలు. ఆమె కవిత్వం స్త్రీ చైతన్యం, సామాజిక న్యాయం, సమానత్వ భావాలను ప్రతిబింబిస్తుంది.
సమాజంలో అసమానతలపై అవిశ్రాంత పోరాటం చేసిన సావిత్రీబాయి వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు. భ్రూ ణహత్యలను అరికట్టేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆడపిల్లల అభ్యున్నతికి అంకితమైన ఆమె, గర్భవతుల కోసం, ఒంటరి మహిళల కోసం సంరక్షణ కేంద్రాలను స్థాపించారు. 1897లో పుణేలో ప్లేగ్ వ్యాధి వ్యాప్తి సమయంలో బాధితులకు సేవలందిస్తూ, అదే వ్యాధికి గురై సావిత్రీబాయి ఫూలే కన్నుమూశారు. ఆమె మరణం కూడా సేవా త్యాగానికి నిదర్శనం.
సావిత్రీబాయి ఫూలే సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమె జయంతిని ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’గా నిర్వహిస్తోంది. ఆమె స్ఫూర్తితో నేటి యువతలో విద్య, సమానత్వం, స్త్రీ సాధికారతపై అవగాహన పెరుగుతోంది. విద్యను కేవలం వ్యక్తిగత హక్కుగా కాకుండా సామా జిక బలంగా భావించే చైతన్యం ఏర్పడింది. ఆనాడు సావిత్రీబాయి చేసిన త్యాగమే నేడు బాలికల విద్య విస్తరణకు, మహిళలు ఉన్నత విద్యావంతులుగా ఎదగడానికి ప్రధాన కారణం. సావిత్రీబాయి ఫూలే పాఠశాలను కేవలం పాఠాలు నేర్పే స్థలంగా కాకుండా సామాజిక మార్పు సాధించే సాధనంగా భావించారు.
ఎస్.యశోద