ఒగ్గు కథా ఒరవడి చుక్కా సత్తయ్య
29న చుక్కా సత్తయ్య జయంతి :
తెలంగాణ జానపద కళా చరిత్రలో ఒగ్గుకథకు ఒక ప్రత్యేక గౌరవాన్ని, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిన మహాకళాకారుడు చుక్కా సత్తయ్య. ఒక ప్రదర్శనకారుడిగానే కాకుండా, ఆయన ఒగ్గుకథా ప్రక్రియలో అపారమైన కృషి చేశారు. మౌఖిక రూపంలో ఉన్న ప్రాచీన పురాణ గాథలను, కుల దైవాల కథలను అద్భుతమైన కథా సాహిత్యంగా తీర్చిదిద్దారు. బీరప్ప కథ, మల్లన్న కథ వంటి సంప్రదాయ గాథలకు తనదైన శైలిలో నాటకీయతను, సాహిత్య సొగసును జోడించారు.
ప్రజా చైతన్యం కోసం ప్రభుత్వ పథకాలను సైతం ఒగ్గుకథా సాహిత్యంగా మలచి సామాన్యులకు అర్థమయ్యేలా అల్లి చెప్పడంలో ఆయనది అందెవేసిన చేయి. చుక్కా సత్తయ్య 1935 మార్చి 29న అప్పటి వరంగల్ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం మాణిక్యాపురంలో జన్మించారు. తండ్రి ఆగయ్య, తల్లి సాయమ్మ. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కుటుంబంలో పుట్టడం వల్ల ఆయన పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించలేకపోయారు.
ఊరి పంతుళ్ల దగ్గర తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నారు. బాలశిక్ష, శతకాలు చదువుతూ అక్షర జ్ఞానాన్ని పెంచుకున్నారు. చిన్నతనంలో ఊరిలో ప్రదర్శించే వీధినాటకాలు సత్తయ్యను విశేషంగా ఆకర్షించాయి. నాటకాల్లోని పాత్రధారులు ధరించే ఆభరణాలు, వస్త్రాలు, వారు చూపే అభినయం చూసి తాను కూడా కళాకారుడు కావాలని సత్తయ్య కలలుగనేవారు.
ఒగ్గుకథతో విడదీయలేని బంధం
సత్తయ్యకు 14 ఏళ్ల వయసులోనే ఒగ్గుకథపై పట్టు చిక్కింది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఈ కళను ప్రాణప్రదంగా ప్రేమించారు. మొదట చిరుతల రామాయణంలో హనుమంతుడి పాత్ర ద్వారా తన కళా ప్రస్థానాన్ని ప్రారంభించారు. సాధారణంగా ఒగ్గుకథ చెప్పే హక్కు (వతన్) కురుమ కులంలో కొందరికే ఉంటుంది. సత్తయ్యకు అటువంటి హక్కు లేకపోయినా తన అంకితభావంతో, నిరంతర కృషితో ఈ విద్యను నేర్చుకున్నారు.
20 ఏళ్ల వయసు నాటికే బీరప్ప కథ, రేణుకా ఎల్లమ్మ కథ, హరిశ్చంద్ర వంటి క్లిష్టమైన కథలను అనర్గళంగా ప్రదర్శించే స్థాయికి ఎదిగారు. నుదుటిపై రెండు పాదాల ముద్ర వంటి చుక్క ఉండటంతో ఆయన ఇంటి పేరు ‘చుక్కా’ గా స్థిరపడిపోయింది. ఒగ్గుకథా ప్రదర్శనలో సత్తయ్య అనేక మార్పులు ప్రవేశపెట్టారు. పాత పద్ధతులకు నాట్యం, నాటకీయత, ఆహార్యం జోడించి ప్రేక్షక లోకాన్ని సమ్మోహితులను చేశారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో దేశ విదేశాల్లో దాదాపు 12 వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు.
ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ఒగ్గుకథను సామాన్యుల ముంగిట తీసుకొచ్చారు. అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, 20 సూత్రాల ఆర్థిక పథకం వంటి సామాజిక అంశాలపై కథలు అల్లి ప్రజలను చైతన్యవంతులను చేశారు. అండమాన్ నుంచి ఢిల్లీ వరకు అనేక వేదికలపై తెలంగాణ జానపద పరిమళాలను వెదజల్లారు.
ఎన్నో మెచ్చుకోళ్లు
చుక్కా సత్తయ్య ప్రదర్శనలకు సామాన్య జనం నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ప్రతిఒక్కరూ మంత్రముగ్ధులయ్యేవారు. మాజీ రాష్ట్రపతులు నీలం సంజీవరెడ్డి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి పెద్దలు ఆయన కళా వైదుష్యాన్ని చూసి పరవశించిపోయారు. నాటి ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు సైతం సత్తయ్య ఒగ్గుకథా ప్రదర్శనలను తిలకించి ఉప్పొంగిపోయారు.
నాటి సీఎం ఎన్టీ రామారావుకు సత్తయ్య అంటే ఎంతో గౌరవం ఉండేది. సత్తయ్య కథా ప్రదర్శనలో ఎన్టీఆర్ అభినయ ఛాయలు కనిపిస్తాయని ఎందరో కళాభిమానులు అంటుండేవారు. వేదికలపై సత్తయ్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ప్రేక్షకులు వీరభద్రుడి అవతారంలో ఆయన చూపించే రౌద్ర రసానికి విస్మయం చెందేవారు.
చుక్కా సత్తయ్య ప్రతిభకు ఎన్నో అత్యున్నత పురస్కారాలు లభించాయి. 2004లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. 2005లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఒగ్గుకళా సామ్రాట్, జానపద కళామూర్తి వంటి బిరుదులతో ప్రజలు ఆయనను గౌరవించుకున్నారు.
రాష్ట్రపతులు, ప్రధానుల నుంచి ప్రశంసలు పొందినప్పటికీ, ఆయనలో కించిత్ గర్వం ఉండేది కాదు. ఆయనది నిరాడంబర జీవితం. సత్తయ్య కేవలం ప్రదర్శనలకు పరిమితం కాకుండా, వందలాది మంది శిష్యులను తయారు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1500 మందికి పైగా కళాకారులకు ఒగ్గుకళలో శిక్షణ ఇచ్చారు.
జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళాసమితిని స్థాపించి ఎందరో కళాకారులను తీర్చిదిద్దారు. 2017 నవంబరు 9న ఈ ఒగ్గు కథా శిఖరం నేలకొరిగింది. ఆయన మరణించినా ఆయన అల్లిన ఒగ్గు కథలు, ప్రదర్శన తెలంగాణ సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. పల్లె ప్రతిభకు ప్రతీకగా నిలిచిన సత్తయ్య ప్రస్థానం రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తిదాయకం.
దిలీప్




