స్కూల్ బస్సు కారు ఢీకొని ప్రభుత్వ వైద్యుడు మృతి
కల్వకుర్తి మే 9 : జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కల్వకుర్తి సమీపంలో నీ సీబీయం కాలేజీ దగ్గర పాఠశాల బస్సు కారు ఢీకొని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ విజయకుమార్ (32 )మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉంటున్న విజయకుమార్ పట్టణ సమీపంలో అక్షర వనంలో ఉదయం షటిల్ ఆడడానికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా సిపిఎం కళాశాల సమీపంలో ఎదురుగా వచ్చిన ప్రైవేటు పాఠశాల బస్సు బలంగా ఢీకొంది.
ఈ ఘటనలో ఆయన కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే మహిత హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యం అందిస్తుండగానే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాను విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రిలో నే తనకు శివపంచనామా చేస్తుండడంతో తోటి వైద్యులు సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.
కల్వకుర్తి పట్టణంలోని నివాసం ఉండేందుకు ఈ మధ్యకాలంలోనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. కల్వకుర్తిలో ఎంతోమంది గర్భిణీలకు సాధారణ డెలివరీ చేసి ఈ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. మృతుని భార్య కల్వకుర్తి మండలం రఘుపతిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా పనిచేస్తుంది . వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.






