29 June, 2026 | 12:21 PM

కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్

09-05-2026 10:15 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ 

హైదరాబాద్: కరీంనగర్‌లో బంద్ పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను గృహ నిర్బంధంలో(BRS MLA Gangula Kamalakar House Arrest) ఉంచారు. మూడు రోజుల క్రితం, బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి నిరసనగా BRS కార్యకర్తలు ఈ బంద్‌ను నిర్వహించారు. ఒక రోజు ముందు, దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని బీఆర్ఎస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీనికి భిన్నంగా, వ్యాపార సంస్థలు తెరిచే ఉంచాలని, బంద్‌ను ధిక్కరించాలని BJP నాయకులు కోరారు. 

పట్టణమంతటా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. భారీగా పోలీసులను మోహరించడంతో పాటు పలువురు నాయకులను ముందుజాగ్రత్తగా అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి పోలీసులు వివిధ ప్రదేశాలలో కార్యకర్తలను, నాయకులను అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. గంగుల కమలాకర్‌తో పాటు, ఎంపీ కార్యాలయం సమీపంలో ఉన్న ఇతర నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

 కరీంనగర్ బంద్ విజయవంతమైందని గంగుల తెలిపారు. ప్రజలకు, బంద్ కు సంబంధం లేదన్న బీజేపీ వ్యాఖ్యలు అసంబద్దం అన్నారు. ఇలాంటి దాడులు మరో కార్యాలయంపై జరిగితే సమర్థిస్తారా? అని గంగుల ప్రశ్నించారు. రాజకీయ నాయకులపై కాకుండా సంఘ విద్రోహ శక్తులపై పోలీసులు దృష్టి సారించాలని కమలాకర్ సూచించారు. ఇటీవల జరిగిన బంగారు దుకాణం దోపిడీ ఘటన వంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని, శాంతిభద్రతలను కాపాడాలని ఆయన కోరారు. మరోవైపు, నగరం అంతటా, సున్నితమైన ప్రాంతాలలో పోలీసు బలగాలను మోహరించారు.