7 March, 2026 | 1:19 PM

హెచ్‌సీఏపై సీఐడీ విచారణ

07-03-2026 12:11 AM

వివాదాస్పదంగా రూ.69 కోట్ల చెల్లింపు అంశం

తన ప్రమేయం లేదన్న కొత్త ప్రెసిడెంట్ అమర్‌నాథ్

హైదరాబాద్, మార్చి 6: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగింది. ఇటీవల కోర్టు ఆదేశాలతో విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.69 కోట్లు చెల్లింపు అంశం వివాదాస్పదంగా మారింది. పలు క్రికెట్ సంఘాలు ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేసాయి.

క్విడ్ ప్రోకో ఒప్పందంతోనే క్రికెట్ నిధులను హెచ్‌సీఏ, విశాఖ దోచుకుంటున్నాయంటూ ఆరోపణలు గుప్పించాయి. దీనికి సంబంధించి జింఖానా గ్రౌండ్స్‌లో క్రికెట్ సంఘాలను నిరసన కూడా తెలిపాయి. కేవలం రూ.4 కోట్లు ఇచ్చి ఇప్పుడు రూ.69 కోట్లు తీసుకోవడం వెనుక కుట్ర ఉందంటూ క్రికెట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. దీనిపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.

అయితే రూ.69 కోట్ల చెల్లింపు వ్యవహారంతో తనకు సంబంధం లేదని ప్రస్తుత ప్రెసిడెంట్ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. తాజాగా సీఐడీ విచారణకు హాజరైన హెచ్‌సీఏ నూతన కమిటీ సభ్యులు ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. తాను బాధ్యతలు తీసుకోకముందే రూ.69 కోట్ల అంశం ప్రాసెస్ మొదలైందని, తాను ఎలాంటి చెక్కులపై సంతకాలు పెట్టలేదని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారమే విశాఖకు హెచ్‌సీఏ చెల్లింపులు జరిపినట్టు వెల్లడించారు. అయితే వరుసగా ఫిర్యాదులు రావడంతో సీఐడీ గత కేసులతో పాటు తాజా ఫిర్యాదుపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నూతన కమిటీ సభ్యులను విచారించగా.. విశాఖకు చేసిన చెల్లింపులపై అమర్‌నాథ్ స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది.