26 August, 2026 | 3:45 PM

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి

09-12-2024 01:09 AM

* మాజీ మంత్రి  కొప్పుల

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి రేవంత్‌రెడ్డి రూపంలో గ్రహ ణం పట్టిందన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మోసపూరిత 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు వాటిని నెరవేర్చకపోవడమే కాక ఏడాది పాలనపై విజయోత్సవా లు జరపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అంటూ ప్రగల్భాలు పలికి రుణమాఫీ, పింఛన్, రేషన్‌కా ర్డు, ఆడబిడ్డలకు రూ.2,500, తులం బంగారం ఇలా ఏ ఒక్కటీ అమలుకాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చడానికి విజయోత్సవాలు జరుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సర్కారు లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాలని, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నాలుగు విడతల్లో 25. 35 లక్షల మంది రైతులకు రూ.20, 616 కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.