ఉత్తుత్తి అనుమతి.. కార్పొరేట్ గమ్మతి!
సీబీఎస్‌ఈ, ఐఐటీ, టెక్నో సెలబస్ పేరుతో అక్రమ వసూళ్లు
- సీబీఎస్‌ఈ అనుమతి ఉందంటూ బహిరంగ ప్రకటన బోర్డులు
- అనుమతి లేకుండానే కొనసాగుతున్న మాడ్యూల్ స్కూళ్లు
- విద్యాశాఖ అధికారులకు కనిపించవు, వినిపించవు?
సిద్దిపేట, డిసెంబర్ 8 (విజయక్రాంతి): సిద్దిపేటలో సీబీఎస్‌ఈ చదువుల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు లేని చదువులతో విద్యార్థుల సామర్థ్యానికి మించి చదువులు చెబుతూ మానసికంగా వారిని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఒక్కో విద్యార్థి సుమారు 10 కిలోల పుస్తకాలను రెండు ఆపైన అంతస్తులకు మోసుకెళ్లాల్సి వస్తోంది. పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండకపోగా, కనీస అర్హతలున్న వారిని కూడా నియమించుకోవడం లేదు.
సరైన గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను కుర్చోబెడుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మొత్తం 74 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. అందులో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుమతి ఉన్న హైస్కూల్ ఒకటి ఉండగా, 24 ప్రాథమికోన్నత స్కూళ్లు ఉన్నాయి. మిగతా 49 హైస్కూళ్లకు స్టేట్ సిలబస్‌కు మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి. కానీ అ్న స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ ప్రకటనా బోర్డులు కనిపిస్తున్నాయి. బహిరంగ ప్రకటన బోర్డుల ఏర్పాటుతో పాటు పంప్లాంట్స్ పంపిణీ చేస్తున్నారు.
అన్నీ తెలిసిన విద్యాధికులైన కొందరు తల్లిదండ్రులు సైతం పాఠశాలల నిర్హాహకుల చేతుల్లో దోపిడికి గురవుతున్నారు. విద్యాహక్కు చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా ఆ శాఖ అధికారులకు నోరు మెదపడం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో అనుమతులు లేని చదువులు చదివించడం గమనార్హం. అనేక పాఠశాలలకు మైదానాలు లేవు. కనీసం వ్యాయామ ఉపాధ్యాయులను కూడా నియమించుకోవడం లేదు. సీబీఎస్‌ఈ సిలబస్, డిజిటల్ తరగతులు, టెక్నో, ఐపీఎల్, సీ బ్యాచ్, ఎం బ్యాచ్, ఎంపీఎల్ ఇలా అనేక పేర్లతో అనుమతులు లేని పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.
అనుమతులు లేకుండానే
సిద్దిపేటలో మాడ్యూల్ ఇంటర్నేషనల్ పేరుతో కొనసాగుతున్న పాఠశాలకు ప్రభు త్వ అనుమతులు లేవు. హైదరాబాద్‌లోని ఇదే పేరు ఉన్న స్కూల్‌కు అనుబంధంగా ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. విద్యాశాఖ నిబంధనల మేరకు ఒకే పేరుతో ఒక పాఠశాల మాత్రమే ఉండాలి. కానీ సిద్దిపేట విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఒకే పేరుతో రెండు నుంచి నాలుగు స్కూల్స్ కొనసాగుతున్నాయి.
సిద్దిపేటలోని కార్పొరేట్ స్థాయి స్కూల్స్ శ్రీచైతన్య, రావుస్, నారాయణ, ఢిల్లీ సెకండరీ, బ్రిలియంట్, ఐక్యూఆర్‌ఏ ఇంటర్నేషనల్, ది మాస్టర్ మైండ్ స్కూల్ తదితర పేర్లతో సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న పాఠశాలలకు స్టేట్ సెలబస్‌కు మాత్రమే అనుమతి ఉంది. ది మాస్టర్ మైండ్ స్కూల్‌కు ప్రాథమికోన్నత పాఠశాలకు మాత్రమే అనుమతి ఉండగా 8, 9, 10 తరగతుల విద్యార్థు లను కూడా చేర్చుకుంటు న్నారు. ఇదే యాజమాన్యానికి ఉన్న ఇతర పాఠశాల రికార్డుల్లో విద్యార్థుల పేర్లను నమోదు చేస్తున్నారు.
మాకేం తెలియదు
సిద్దిపేటలోని ప్రైవేట్ పాఠశాలల భాగోతంపై జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా సిద్దిపేటలో ఇలా జరుగుతుందా? నాకేం తెలియదంటూ సమాధానమిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల మేరకే కొనసాగుతున్నాయంటూ వత్తాసు పలికారు. అన్ని విషయాలు తమకు తెలియాల్సిన అవసరం లేదని తన కింద చాలా మంది బాధ్యత కలిగిన అధికారులు ఉన్నారని, వారికి తెలిస్తే సరిపొతుందంటూ మాట దాటవేశారు.






