ఆగస్టు 31లోగా సీసీఐ పునరుద్ధరణపై స్పష్టతనివ్వాలి
లేదంటే ఆమరణ నిరాహార దీక్ష.. మాజీమంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జూలై 17 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31లోగా స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని, అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయబోనని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ప్రకటించారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ అంశంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
పక్క రాష్ట్రంలోని స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులిస్తుండగా, ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించకుండా విక్రయించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని అన్నారు. 2017లో ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ ప్రజలకు సీసీఐ పునరుద్ధరణపై హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.
సీసీఐలో చట్టవిరుద్ధంగా స్క్రాప్ టెండర్లు పిలిచారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిని అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు కమిషన్లు వచ్చే పనులపైనే దృష్టి ఉందని, ఐదువేల మంది యువతకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సీసీఐ సాధన సమితి పరిశ్రమ పునఃప్రారంభం కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తుంటే, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ప్రజల ముందుకు రావడం లేదని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ నాయకులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, హంసరాజ్ గంగారాం, అనంత్ గీతే తదితరులు గతంలో సీసీఐ పునరుద్ధరణపై హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం ఆదిలాబాద్ ప్రజలను, యువతను మోసం చేసినట్లేనని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్ నిధులతో సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించేందుకు కేంద్ర సహకారం కోరినా స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో భూముల అంశాలపై చూపుతున్న ఆసక్తిని సీసీఐ పునరుద్ధరణపై కూడా చూపాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, విజ్జగిరి నారాయణ, సాజితోద్దీన్, రాజన్న, బట్టు సతీష్,దాసరి రమేష్,పరమేశ్వర్, సురేందర్, ఆసిఫ్, అశోక్, అనిల్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.






