ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా భారత్
- కేంద్రం ‘సెమికాన్ 2.0’ నిర్ణయం హర్షణీయం
- తెలంగాణలో ఈఎంసీలకు కేంద్రం ప్రోత్సాహం
- రాష్ట్రానికి రూ.724 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): కేంద్రప్రభుత్వం తీసుకున్న సెమికాన్ 2.0’ పథకం ద్వారా భారత్ ప్రపంచ సెమీకండక్టర్ శక్తిగా ఎదగబోతున్నదని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. కేంద్రం రూ.1,27,500 కోట్ల వ్యయంతో 12 సంవత్సరాల కాలవ్యవధితో చేపట్టనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంతో దేశం ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తుందని జోస్యం చెప్పారు.
అలాగే, రూ.62,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన మొబైల్ ఫోన్ తయారీ పథకం కూడా సరికొత్త విప్లవానికి నాంది పలుకనున్నదని తెలిపారు. మొత్తంగా ప్రధాని మోదీ రూ.1.9 లక్షల కోట్లతో బైల్, సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి బాటలు వేశారని, ఈ సందర్భంగా తాను ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాననిప్రకటించారు. ఈ-సిటీ, ఫ్యాబ్ సిటీలో ఏర్పాటుచేసిన గ్రీన్ఫీల్ జువీ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.252 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు.
మహేశ్వరం, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ (ఈఎంసీ) ప్రాజెక్టు కూడా రూ.139 కోట్లు ఇచ్చిందని వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్‌కు రూ.75 కోట్లూ కేంద్రమే అందించిందని, మహబూబ్‌నగర్ జిల్లాలో దివిటిపల్లిలో ఏర్పాటు చేయనున్న ఈఎంసీ ప్రాజెక్టుకు రూ.258 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వమే అందించిందని వివరించారు. తెలంగాణలో ఈవీలకూ రూ.724 కోట్ల ఆర్థిక సాయం అందించిందని వివరించారు.
సెమికాన్ 2.0లో చిప్ డిజైన్, మెషిన్స్ మెటీరియల్స్, మరిన్ని సిలికాన్/కాంపౌండ్, సెమీకండక్టర్/ అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్‌టెస్ట్ పరిశ్రమల విస్తరణ అనే ప్రధాన అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో జరుగుతున్న మార్పులను తెలంగాణకు అవకాశాలుగా మలుచుకునేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెమికాన్ 2.0తో తెలంగాణకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు రూ.1,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు అందించిందని, ఇప్పుడు సెమికాన్ 2.0 ద్వారా వచ్చే అవకాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని, సెమీకండక్టర్ తయారీ, డిజైన్ సెంటర్లు, పరిశోధనా సంస్థలను ఆకర్షించేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీంకు ఆమోదం...
సెమికాన్ 2.0తో పాటుగా.. రూ.62,500 కోట్లతో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఎంపీఎం)కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిందని, 2026--27 నుంచి 2030--31 వరకు ఐదేళ్లపాటు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశంలో మొబైల్ ఫోన్స్ తయారీని మరింత విస్తరించడం, దేశీయంగా వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్షన్ పెంచడం, సప్లయ్ చైన్‌ను బలోపేతం చేయడం, భారతీయ బ్రాండ్లను ప్రపంచస్థాయికి మరింతగా తీసుకెళ్లడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని, దేశ మొబైల్ తయారీ రంగంతోపాటుగా తెలంగాణలో మొబైల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.
తెలంగాణ యువతకు కూడా ఇదొక సువర్ణావకాశమని, చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ వంటి యువత ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుని ప్రపంచస్థాయి ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.






