14-01-2026 12:23:53 AM
కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్
సూర్యాపేట, జనవరి 13 (విజయక్రాంతి) : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి పల్లె నుంచి ప్రపంచ స్థాయికి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్2025 క్రీడా పోటీలను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి హాజరై క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వరకు సాగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కప్ పోటీల ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమేనని స్పష్టం చేశారు. సీఎం కప్2025 పోటీలు 44 క్రీడల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో నిర్వహించను న్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఈ నెల 17 నుంచి 22 వరకు, మండల స్థాయిలో 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు, రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు పోటీలు జరుగుతాయన్నారు. అర్హత కలిగిన యువత stag.telangana.gov.in పోర్టల్ ద్వారా లేదా గూగుల్లో CM Cup అని నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. డీవైఎస్‌ఓ వెంకటరెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఎల్పీఓ నారాయణరెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంఈఓ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.