ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
మనిషి కంటే ఏఐకి ఎక్కువ తెలివితేటలు
ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇండియా ఏఐ ఇంపాక్ట్(India AI Impact Summit) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలిపారు. మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చన్న సీఎం ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఏఐ ఫలితాలు మనం చేస్తున్నామన్నారు. మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని పేర్కొన్నారు. ఏఐ శకం ఇప్పటికే మొదలైందని ఆయన వెల్లడించారు.
గతంలో పారిశ్రామిక విప్లవం.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం
గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం(Software revolution) నడుస్తోందని తెలిపారు. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడుతారని సీఎం వివరించారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్(India global leader) గా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటుచేయాలని కోరారు. ఏఐ వార్ రూమ్(AI War Room) కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం అన్నారు. హైదరాబాద్ లో ఏఐ వర్సిటీని ఇప్పటికే సకల వసతులతో ఏర్పాటు చేశామని సూచించారు.
ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. ఇండియా అందిపుచ్చుకోవాలన్నారు. ఏఐలో స్టార్ట్ ప్ లను భారత్ ప్రోత్సహించాలని సీఎం కోరారు. ప్రతి ఆరు నెలలకోసారి హైదరాబాద్ వంటి ప్రదేశంలో ఏఐ సదస్సులు జరగాలని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి టెక్నాలజీ దిగ్గజాలను కోరారు.




