15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

11-04-2025 06:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవనం(Musi Revival)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో(Command Control Center) ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మీర్ ఆలం ట్యాంక్‌(Mir Alam Tank)పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, బాపూ ఘాట్‌ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌తో పాటు మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను పరిశీలించి, బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని చెప్పారు.

ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఉండే విధంగా డిజైన్లను ఎంచుకోవాలన్నారు. ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్లు ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సింగపూర్‌(Singapore)లోని గార్డెన్స్ బై ది బే(Gardens By The Bay)ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్‌తో కూడిన డిజైన్లు ఉండాలి.

బోటింగ్‌తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని, ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని,  పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు రూపొందించాలి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించి ఆ మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని, ఇక్కడి అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలన్నారు. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అభివృద్ధి ప్రతిపాదనలన్నీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.