06-12-2025 04:54:37 PM
హైదరాబాద్: రుణమాఫీ పేరిట పదేళ్లపాటు రైతులను కేసీఆర్ మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.21 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కలవలేదని, ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ లోకి మంత్రులు సహా ఎవరిని రానివ్వలేదని సీఎం ఎద్దేవా చేశారు. ఇప్పడు పామ్ హౌజ్ లో సర్పంచ్ లు, వార్డు నంబర్లను కూడా కేసీఆర్ కాలుస్తున్నారని, కేసీఆర్ ఓడిపోయాకే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
ఈ ప్రభుత్వం వచ్చాక యువతకు 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పదేళ్లపాటు పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ పనులు మేం ప్రారంభించగానే సోరంగంలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని, ఏదేమైనా ఈ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ నేతలు సంబరపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.