2 May, 2026 | 11:54 AM

విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

02-05-2026 10:31 AM

విద్యుత్ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్(Power Department) సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేంద్ర రెడ్డితో పాటు ఇంధన శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

⁠గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. సోలార్ పవర్ పైన స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. సోలార్ స్టౌల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని వివరించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ (Solar Power) ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

⁠పైలట్ ప్రాజెక్ట్ కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్ స్టేషన్ల పక్కన ప్రయోగాత్మకంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్లు (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy) ఆదేశించారు. విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని వెల్లడించారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ Rythu Discomలో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.