15 July, 2026 | 12:40 AM

నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక

15-07-2026 12:00 AM

ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్సీ, ఎమ్మెల్యే జీఎంఆర్ తదితరులు

మహబూబ్ నగర్, జూలై 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దివిటిపల్లి గ్రామంలోని అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ పర్యటన సమావేశ కార్యక్రమానికి సీఎం విచ్చేయనున్న సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా, జిల్లా ఎస్పీ డి. జానకి తదితర అధికారులు హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, సమావేశ ప్రాంగణం, వీఐపీ రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీఎం బందోబస్తు విధులకు హాజరైన అధికారులు, సిబ్బందికి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించి, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను అత్యంత అప్రమత్తతతో, సమన్వయంతో నిర్వర్తించాలని ఆదేశించారు.

ఇది ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం కావున భద్రతా పరంగా ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతి అధికారి, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.15గంటలకు రానున్నారు. అమరరాజా ఫ్యాక్టరీలో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవం  సీఎం చేయనున్నారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా కొత్తకోట కు బయలుదేరి ప్రభుత్వం బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి  హైదరాబాద్ వెళ్లానున్నారు.