5 May, 2026 | 1:54 AM

త్వరలో హీరాపూర్‌కు సీఎం రాక

05-05-2026 12:26 AM
  1. ఎమ్మెల్యే బొజ్జ పటేల్ వెల్లడి
  2. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్

ఉట్నూర్, మే 4 (విజయక్రాంతి) : గ్రామస్థుల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని, వాటిని నిర్ణీత కాలపరిమితి లో పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో ఖానాపూర్ ఎ మ్మెల్యే వేడ్మ బొజ్జు, ఐటీడీఏ పిఓ మంద మకరందు తో కలిసి ఆయన ’ప్రజావాణి’ గ్రామ సభ, ’ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా గ్రామంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

అనంతరం పలువురు రైతులకు భూసార పరీక్షవిశ్లేషణ దృవీకరణ పత్రాలను అంద జేసి, విద్యుత్ జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... రెవెన్యూ సంబంధిత భూ సమస్యలను 10 నుంచి 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని, ఏడు ఆవాస ప్రాంతాలకు రూ. 25 లక్షలతో త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేశామన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అటవీ హక్కు పత్రాలు, రెవెన్యూ పట్టాల సర్వే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వ్యవసాయ వారోత్సవాల్లో భాగంగా రైతులు తమ పొలాల్లో మట్టి పరీక్షలు చేయించుకోవాలని, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలని సూచించారు.

ముఖ్యంగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే తీసుకోవాలని, నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం జిల్లా కేంద్రానికే పరిమితం చేయకుండా, డివిజన్, మండల స్థాయిల్లోనూ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి దరఖాస్తును 30 రోజుల్లోగా పరిష్కరించి, బాధితులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏపీ వో పీవీటీజీ ఆత్రం భాస్కర్, డీడీ అంబాజీ, ఈఈ తానాజీ, జీసీసీ డీఎం సందీప్, స్థానిక సర్పంచి తొడసం లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.