నేడు, రేపు సీఎం ఉమ్మడి జిల్లా పర్యటన
ముఖ్యమంత్రి పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్నగర్, మే 3 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జూన్ నేడు, రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి.జానకి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓ.ఎస్.డి కమలాసన్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు ప్రజా ప్రతినిదులతో కలిసి జడ్చర్లలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. జడ్చర్ల ఏరియా ఆసుపత్రి సమీపంలో ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
సభా ప్రాంగణం పరిసరాల పరిశుభ్రత, వేదిక ఏర్పాటు, టెంట్ల ఏర్పాటు, ప్రజల కోసం తగిన సీటింగ్ సదుపాయాలు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, ప్రత్యేక వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు, భద్రతా కోసం పోలీస్ బందోబస్తు, బ్యారికెడ్ల ఏర్పాట్లు, తదితర అంశాలను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాట్ల పరిశీలిన
ముందుగా ఉదయం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్ . పి.డి. జానకితో కలిసి ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద హెలిపాడ్ల నిర్మాణం, ముఖ్యమంత్రి సందర్శన కోసం ఏర్పాటు చేయనున్న వ్యూ పాయింట్ వద్ద బారికేడ్ల నిర్మాణం, పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, అలాగే రిజర్వాయర్ వద్ద వాహనాల పార్కింగ్, నీడ కొరకు టెంట్లు ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం, వి.ఐ.పి సమావేశానికి గ్రీన్ రూముల ఏర్పాటు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లను జిల్లా అధికారుతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్తో పాటు మంత్రుల హెలికాప్టర్లు దిగేందుకు రెండు హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యూ పాయింట్ వద్ద భద్రతా దృష్ట్యా పటిష్టమైన డబుల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ముఖ్యమంత్రితో పాటు వచ్చే వీఐపీల వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించి, సందర్శకుల సౌకర్యార్థం అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు.
కరివెన రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
కరివెన రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ కోసం హెలిప్యాడ్ల నిర్మాణం, రిజర్వాయర్ కట్టపై ఏర్పాటు చేయనున్న వ్యూ పాయింట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు, భద్రతా చర్యలు, రిజర్వాయర్ కట్ట దిగువన ముఖ్యమంత్రి, వీఐపీలు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేయనున్న భోజన వసతులు, అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశం కోసం అవసరమైన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
పోలీసు శాఖ అధికారులు భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక అధికారులు 2 ఫైర్ టెండర్లను రిజర్వాయర్ వద్ద ఉంచాలని, విద్యుత్ శాఖ అధికారులు నిరంతరాయ విద్యుత్ కోసం జనరేటర్లు ఏర్పాటుచేయాలని అన్నారు. అటవీ శాఖ అధికారులు సమావేశం స్థలంలో కోతులు, తేనెటీగలు, పాములు లేకుండా చూసుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, ఆర్ & బి, అగ్నిమాపక, అటవీశాఖ, వైద్య ఆరోగ్య, తదితర శాఖాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ఎస్.పి డి.జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ, అదనపు కలెక్టర్ జె. ఎల్. బి హరిప్రియ,ఇరిగేషన్ ఎస్.ఈ సత్యనారాయణ రెడ్డి, జడ్.పి.సి.ఈ.ఓ వెంకట రెడ్డి,డి.ఆర్.డీ.ఓ నర్సింహులు,ఆర్.డి.ఓ నవీన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.






