7 May, 2026 | 4:11 AM

పేలిన స్టార్‌షిప్ రాకెట్

08-03-2025 01:22 AM

ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ

వాషింగ్టన్, : స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగించిన కొద్ది నిమిషాలకే నియంత్రణ కోల్పోయి ఆకాశంలోనే పేలిపోయింది. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా సాయంత్రం 5:30 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు. అయితే కాసేపటికే స్టార్ షిప్ రాకెట్ విఫలమవ్వడం స్పేస్ ఎక్స్‌కు పెద్ద కుదుపు. రాకెట్‌కు సంబంధించిన శకలాలు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా, బహమాస్ దీవుల్లో పడిపోయాయి. అయితే ప్రమాద సమయంలో జనాలు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఎయిర్ ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది. దీంతో మయామి, ఫోర్ట్ లాడర్ డేల్, పామ్ బీచ్, ఓర్లాండ్ విమానాశ్రయాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయోగ విఫలంపై స్పేస్ ఎక్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయోగం సమయంలో స్టార్ షిప్ ముందుగా నిర్ణయించిన మార్గంలో వేగంగా కదలలేకపోయిందని.. అందుకే రాకెట్‌తో సంబంధాన్ని కోల్పోయామని పేర్కొంది. ఈ వైఫల్యంపై దర్యాప్తు చేస్తామని స్పేస్ ఎక్స్ తెలిపింది. అంతకముందు జనవరిలో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిన సంగతి తెలిసిందే.